ఆ రాజధాని మాది కాదు: వైకాపా
posted on Oct 27, 2015 12:41PM
.jpg)
జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచే అమరావతి నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరికిస్తున్నారనే సంగతి పెద్ద రహస్యమేమీ కాదు. అందుకు ఆయన చెపుతున్న కారణాలు ఒకటయితే, అసలు కారణాలు మాత్రం వేరేనని తెదేపా నేతలు వాదిస్తున్నారు. అమరావతి నిర్మాణం జరిగితే వచ్చే ఎన్నికలలో ప్రజలు మళ్ళీ తెదేపాకే అధికారం కట్టబెడతారనే భయంతోనే రైతులను రెచ్చగొడుతూ దానికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని తెదేపా నేతల వాదిస్తున్నారు. జగన్ బ్యాచ్ అమరావతి శంఖుస్థాపన కార్యక్రమాన్ని బహిష్కరించడం, శంఖుస్థాపన కార్యక్రమం జరిగిన మర్నాడే రాజధాని గ్రామాలలో పర్యటించి రైతులను న్యాయపోరాటం చేయమని రెచ్చగొట్టడం వంటివన్నీ తెదేపా నేతల ఆరోపణలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. ఆ అనుమానాలు నిజమేనని ప్రజలు భావించే విధంగా వైకాపా సీనియర్ నేత మైసూరా రెడ్డి మాట్లాడారు.
ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ “అమరావతి మా రాజధాని కాదు. దానితో మాకు ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే అది రియల్ ఎస్టేట్ మాఫియాకి అడ్డాగా మారిపోయిందిపుడు. అక్కడ సామాన్య ప్రజలెవ్వరూ జీవించే పరిస్థితులు లేవు. అధికార పార్టీ నేతలు రైతులను భయబ్రాంతులను చేస్తున్నారు. అయినా అక్కడ రాజధాని నిర్మించడం రైతులకే కాదు మా రాయలసీమవాసులెవ్వరికీ ఇష్టం లేదు. ప్రభుత్వం ఎవరి మాట పట్టించుకొనే పరిస్థితిలో లేదు. కనుక ఆ రాజధానితో మాకు ఎటువంటి సంబంధము లేదు. అందుకే చంద్రబాబు నాయుడు అక్కడ ఏమి చేసుకొంటున్నా మేము పట్టించుకోవడం లేదు,” అని అన్నారు. మైసూరా రెడ్డి చాలా తెలివిగా రాయలసీమవాసుల ప్రస్తావన చేసినప్పటికీ ఆయన వైకాపా మనసులో మాటను విస్పష్టంగా బయటపెట్టుకొన్నారు.