తండ్రిని గుర్తు పట్టలేకపోయిన గీత
posted on Oct 27, 2015 10:11AM
.jpg)
పాకిస్తాన్ నుంచి నిన్న డిల్లీ వచ్చిన యువతి గీతకు ఆమెను ఇంత కాలం భద్రంగా చూసుకొన్న ఈధీ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులకు భారత్ విదేశాంగ శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రధాని నరేంద్ర మోడిని వారు కలిసారు. భారత్ కు చెందిన గీతను ఇన్నేళ్ళపాటు ఎంతో భద్రంగా చూసుకొన్నందుకు ప్రధాని నరేంద్ర మోడి, సుష్మా స్వరాజ్ ఈధీ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోడీ వారికి కృతజ్ఞతా పూర్వకంగా కోటి రూపాయలు విరాళం ఇచ్చేరు.
గీతను బీహార్ కు చెందిన ఆమె తండ్రి జనార్ధన్ మహతోకు అప్పగించే ముందు, ఆమె అతని తండ్రేనని నిర్ధారించుకొనేందుకు ఆమెకు, ఆమె తండ్రికి జనార్ధన్ మహతోకు డి.ఎన్.ఎ.పరీక్షలు నిర్వహించడానికి ఎయిమ్స్ వైద్యులు వారి రక్త నమూనాలు సేకరించారు. కానీ ఇక్కడే కధ ఊహించని మలుపు తిరిగింది. పాకిస్తాన్ లో 15ఏళ్లపాటు ఉండి వచ్చిన గీత జనార్ధన్ మహతోను తన తండ్రిగా గుర్తించలేకపోవడంతో ఆయనతో కలిసి ఆయన ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది. అధికారులతో బాటు ఆమె తండ్రిగా చెప్పుకొంటున్న జనార్ధన్ మహతో కూడా షాక్ అయ్యారు. డి.ఎన్.ఎ.పరీక్షల నివేదిక వస్తే గానీ అతను గీతకి తండ్రా కాదా అనే విషయం నిర్ధారణ కాదు. ఒకవేళ అతను నిజంగా ఆమె తండ్రి అయితే అప్పుడు వారి కుటుంబసభ్యులు అందరితో గీతని కూర్చోబెట్టి మాట్లాడించి ఆమెకు గత స్మృతులు జ్ఞప్తికి తెచ్చే ప్రయత్నం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ జనార్ధన్ మహతో ఆమె తండ్రి కానట్లయితే, అతనీతో బాతి ఇంకా చాలా మంది ఆమె తల్లితండ్రులమని చెప్పుకొంటూ ముందుకు వచ్చిన వారినందరినీ పిలిపించి వారికీ డి.ఎన్.ఎ.పరీక్షలు నిర్వహించి వారిలో ఆమె అసలు తల్లితండ్రులు ఉన్నారో లేదో నిర్ధారించుకొంటారు. అంతవరకు గీతను ఇండోర్ లో ప్రభుత్వం మహిళా వసతి గృహంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిమ్స్ వైద్యులు ఇవ్వాళ్ళ వారిరువురి డి.ఎన్.ఎ నివేదికని సమర్పించవచ్చునని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్ జాన్ సినిమాలో సరిగ్గా ఇటువంటి కధాంశంతోనే తీసినప్పటికీ దానిలో గీత ఇచ్చిన ఈ ట్విస్ట్ మాత్రం లేదు.