కిక్కిరిసిన తిరుమల కొండ...ప్రైవేట్ వాహనాలకు నో ఎంట్రీ

 

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవను తిలకించేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. మాడ వీధుల గ్యాలరీలు పూర్తిగా నిండిపోవడంతో మరింత మంది భక్తులను లోపలికి అనుమతించలేదు. దీంతో మేదర మిట్ట, నందకం, లేపాక్షి ప్రాంతాల వరకు భక్తులు బారులు తీరారు. అనూహ్యంగా పెరిగిన రద్దీ కారణంగా అలిపిరి ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. కార్లు, బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు కిలోమీటర్లకొద్దీ నిలిచిపోయాయి. 

దీంతో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. భద్రతా పరంగా అలిపిరి టోల్‌గేట్ వద్ద టీటీడీ విజిలెన్స్, పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కొండపైకి అనుమతిస్తున్నారు. ఈ చర్యలతో వాహనాల కదలిక నెమ్మదించినప్పటికీ, స్వామివారి సేవ కోసం భక్తులు ఓపికతో వేచి చూశారు.

ఈ భారీ రద్దీని అదుపు చేసేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. నాలుగు మాడ వీధులు భక్తులతో నిండిపోయాయి. గరుడ సేవను సమీపం నుంచి చూడాలనే ఉత్సాహంతో వేలాది మంది భక్తులు శనివారం రాత్రి నుంచే గ్యాలరీలలో స్థానం దక్కించుకుని రాత్రంతా జాగారం చేశారు. చలి వాతావరణాన్ని పట్టించుకోకుండా ఎదురుచూస్తున్న వారికి టీటీడీ సిబ్బంది పాలు, బిస్కెట్లు, తాగునీరు అందించారు.

భక్తుల భద్రత, సౌకర్యం కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా మాడ వీధులలో శాంతిభద్రతలు కాపాడేందుకు 64 మంది ప్రత్యేక సిబ్బంది, 14 మంది అధికారులు నియమించారని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కఠినమైన భద్రతా చర్యలు అమలు చేశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu