టీటీడీ ప్రతిష్టను భూమన కరుణాకర్ రెడ్డి దెబ్బతీస్తున్నారు : భానుప్రకాష్ రెడ్డి
posted on Sep 16, 2025 8:55PM

వైసీసీ మాజీ ఎమ్మెల్యేే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ భూమన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అలిపిరి దగ్గర గతంలో ఒక ప్రైవేట్ శిల్పా క్వార్టర్స్ ఉండేది. పట్టు కన్నయ్య అనే శిల్పి నిర్వహించేవాడు. బెంగళూరుకి చెందిన ఓ భక్తుడు శనీశ్వరుడి విగ్రహం ఆర్డర్ ఇచ్చాడు. శిల్పం తయారీలో లోపం రావడంతో.. ఆ రాతి విగ్రహాన్ని అక్కడే ఉంచారు. గత పదేళ్లుగా ఆ విగ్రహం ఆ ప్రాంతంలోనే ఉంది. నేడు కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహమని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.
గతంలో తిరుమల ఆలయంలోని రాములవారి ఉత్సవ విగ్రహానికి వేలు విరిగిపోయింది. మూడున్నర సంవత్సరాలు పట్టించుకున్న పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాములవారి విగ్రహానికి ఆగమశాస్త్రం ప్రకారం మరమ్మతు చేశాం’’ అని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అసత్య ప్రచారాలు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని బోర్డు సభ్యుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హెచ్చరించారు.
భూమన మాటలను, ఆరోపణలను నమ్మవద్దని ఆయన భక్తులను విన్నవించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక...అసత్య ప్రచారాలతో హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే పనిగట్టుకున్నాడు బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మీ అన్నారు. మహావిష్ణువు విగ్రహానికి.... అసంపూర్ణమైన శనిభగవానుడి విగ్రహానికి తేడా తెలీదని ఆమె ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసం, మీడియాలో కనిపించాలనే ఉద్దేశంతో....భూమన కరుణాకర్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని మరో బోర్డు సభ్యుడు దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవడం చాలా దారుణమని భూమన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తిరుమల అలిపిరి వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పష్టం చేసింది. అది అసలు విష్ణుమూర్తి విగ్రహమే కాదని, శిల్పి మధ్యలో వదిలేసిన అసంపూర్తి శనీశ్వరుడి విగ్రహమని తేల్చిచెప్పింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్యాలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.