తిరుమలలో వీఐపీల సందడి... కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on Sep 14, 2025 11:31AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం వరకు సాధారణంగా ఉన్న రద్దీ.. శని, ఆదివారం వరుస సెలవులు రావడంతో.. ఒక్కసారిగా తాకిడి పెరిగిపోయింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ప్రస్తుతం తిరుమల కొండపై ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి.. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా.. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, అనిత, సవిత, సంధ్యారాణి, ఎంపీ పురందేశ్వరి, మాజీ మంత్రి పరిటాల సునీత, మహారాష్ట్ర ఎంపీ రోహిణి,ఎంపీ సుధా నారాయణమూర్తి, మాజీ గవర్నర్ తమిళ సై, ఎంపీ పురందేశ్వరి, తమిళనాడు మంత్రి గాంధీ శ్రీవారి దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉంటే శనివారం తిరుమల శ్రీవారిని 82149 భక్తులు దర్శించుకోగా.. 3.85 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.