జీహెచ్ఎంసీ.. దేశంలోనే అతి పెద్ద మునిసిపల్ కార్పొరేషన్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద మునిసిపల్ కార్పొరేషన్ గా అవతరించింది. ఈ మేరకు హైదరాబాద్ మహానగర పాలనలో  తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులను చేసింది. ఈ మార్పుల మేరకు జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య ప్రస్తుతమున్న వాటికి రెట్టింపైంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది.  ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)  లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు ,కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన తర్వాత, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  

దీంతో  2000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ హైదరాబాద్ మహానగరం ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించింది. డీలిమిటేషన్ లో భాగంగా   నగరంలో  జోన్లు , సర్కిళ్ల సంఖ్యను కూడా ప్రభుత్వం  పెంచింది. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, అలాగే 30 సర్కిళ్లను 60కి పెంచింది. కొత్తగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లు ఏర్పాటయ్యాయి.  45 వేల మంది జనాభాకు ఒక వార్డు ఉండేలా ప్రణాళికలు రూపొందించడంతో పాటు, ప్రతి జోన్‌లో ఐదు సర్కిళ్లు ఉండేలా  అవసరమైన చర్యలు తీసుకుంది.

 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రజలు, రాజకీయ పార్టీల నుండి దాదాపు ఆరు వేల అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. వాటన్నింటినీ పరిగణనలోనికి తీసుకున్న అనంతరం తుది నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇక పోతే ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ముగియనున్న సంగతి తెలిసిదే. ఈ లోపే వార్డుల పునర్విభజన , ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను పూర్తి చేసి, కొత్త వార్డుల ప్రకారం ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu