పేదరికం నుంచి హింసా మార్గం వరకు...మావోయిస్టు దేవా జీవిత గమనం

 

పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన బర్సీ దేవా, చదువు మధ్యలోనే ఆపి మావోయిస్టు ఉద్యమంలో చేరాడు. 2003లో సీపీఐ మావోయిస్టు పార్టీలో అడుగుపెట్టిన అతడు, క్రమంగా కీలక పదవులు చేపట్టి PLGA బటాలియన్ కమాండర్ స్థాయికి ఎదిగాడు. ఐఈడీ పేలుళ్లు, అంబుష్ దాడులు, రాజకీయ నేతల హత్యలతో దండకారణ్యంలో రక్తపాతానికి కేంద్రంగా మారాడు. జీరాం ఘాటి వంటి సంచలన దాడుల్లో అతడి పాత్ర దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, జగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువ్వర్తి గ్రామం బర్సీ దేవా స్వగ్రామం. తండ్రి దివంగత దేవా, తల్లి సింగే. అన్నయ్య సొండా, తమ్ముళ్లు ఐటల్, సన్నల్, బుద్రాల్ పువ్వర్తి గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. 

సోదరి మల్లే చిన్న బట్టి గూడెం గ్రామానికి చెందినవారు, ఆమె భర్త మడకం దేవా వ్యవసాయం చేస్తుంటారు. పువ్వర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివిన దేవా, అనంతరం జగురుగొండ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యనభ్యసించాడు. 1997లో 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత చదువుకు పూర్తిగా వీడ్కోలు పలికాడు. 1998లో నందేను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్న బర్సీ దేవా జీవితం పేదరికం నుంచి హింసాత్మక మార్గం వరకూ సాగిన ఒక వివాదాస్పద ప్రయాణానికి ప్రతీకగా నిలిచింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu