బళ్లారి కాల్పుల వివాదం...ఎస్పీ ఆత్మహత్యాయత్నం
posted on Jan 3, 2026 2:57PM

కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వర్గాల మధ్య వివాదం తలెత్తంది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసి కాల్పుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్యడిని చేస్తూ బళ్లారి ఎస్పీని కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో మనస్తాపానికి గురై ఎస్పీ తుమకూరు జిల్లా శిరా తాలూకాలోని తన ఫామ్ హౌస్‌లో నిద్రమాత్రలు మింగి ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం.
బళ్లారిలో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం ఎమ్మెల్యే వర్గీయులు జనవరి 1, 2026న ఫ్లెక్సీలు కట్టే విషయంలో ఘర్షణపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి , బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర గోడవ చోటుచేసుకుంది. ఈ గొడవ ముదిరి రాళ్లు రువ్వుకోవడం, చివరకు కాల్పుల వరకు దారితీసింది. ఈ కాల్పుల్లో రాజశేఖర్ రెడ్డి అనే కాంగ్రెస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోవడంతో బళ్లారిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ కాల్పుల ఘటన రాజకీయంగా పెద్ద దుమారం రేపిం ది. ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు తదితరులపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు, తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఇరువర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. పోలీసులు ఈ కేసులో ఇప్పటికే 40 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బళ్లారిలో హై టెన్షన్ మొదలైంది