డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే కుమారుడు అరెస్టు… రాజకీయ వర్గాల్లో కలకలం
posted on Jan 3, 2026 4:17PM

డ్రగ్స్ వినియోగం కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నార్సింగి పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో డ్రగ్స్ తీసుకుంటూ కనిపించిన సుధీర్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సుధీర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నార్సింగి ప్రాంతంలో అనుమానాస్పద కదలికలపై సమాచారం అందడంతో ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో సుధీర్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి తిరుగుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి వారిద్దరిని పట్టుకున్నారు. పోలీసులు ఆ ఇద్దరికీ డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
డ్రగ్స్ వినియోగానికి అలవాటు పడిన వ్యక్తులను శిక్షించడమే కాకుండా, పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతో సుధీర్ రెడ్డిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకు న్నారు? డ్రగ్స్ కి సంబంధించి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా, సుధీర్ రెడ్డి గతంలో కూడా రెండుసార్లు డ్రగ్స్ వినియోగం కేసుల్లో దొరికినట్లు సమా చారం.
సుధీర్ రెడ్డి గతంలో కూడా రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డట్టు సమాచారం. అప్పట్లో హెచ్చరికలు, కౌన్సెలింగ్ ఇచ్చినా, మళ్లీ అదే బాటలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల కొంతకాలంగా కుటుంబ సమస్యలతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడని, అదే డ్రగ్స్ వినియోగానికి దారితీసి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడటం ఇప్పుడు తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పోలీసులు ‘చట్టం ముందు అందరూ సమానమే’ అన్న సందేశాన్ని స్పష్టంగా ఇస్తున్నారు.ఈ ఘటనతో డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. పూర్తి విచారణ అనంతరం కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.