సీనియర్లను టెక్నాలజీతో దారిలోకి తెచ్చుకున్న చంద్రబాబు
posted on Sep 19, 2015 2:28PM

టెక్నాలజీని వాడుకోవడంలో రాజకీయ పార్టీలు ఆరితేరిపోయాయి, ఈ ట్రెండ్ విదేశాల్లో పదేళ్ల క్రితమే మొదలైనా, ఇండియాలో మాత్రం 2014 ఎన్నికల టైమ్ నుంచే ఎక్కువగా కనిపించింది, సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో మోడీ అందరి కంటే ముందున్నట్లు కనిపించినా, టెక్నాలజీని వాడుకోవడంలో మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు తర్వాతే ఎవరైనా అంటారు ఆయన గురించి తెలిసివాళ్లు. అందుకే నైన్టీస్ లో ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా... ముందుచూపుతో ఐటీకి పెద్దపీట వేశారని, అదే ఇప్పుడు తెలంగాణకు పెద్ద ఆదాయ వనరుగా మారిందంటారు. పదేళ్ల క్రితమే హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు... టెక్నాలజీని ఏ అవసరానికి ఎలా వాడుకోవాలో తెలుసు, అందుకే అభ్యర్ధుల ఎంపిక దగ్గర్నుంచి పార్టీ సభ్యత్వం వరకూ అన్నింటిలోనూ హైటెక్ విధానాన్నే ఫాలో అయ్యారు.పార్టీపరంగానూ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కారు, 2014 ఎన్నికల సమయంలో ఐవీఆర్ఎస్ స్టిస్టంను ప్రవేశపెట్టి, పాలిటిక్స్ ను కొత్త పుంతలు తొక్కించిన చంద్రబాబు... మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు అభ్యర్ధులను ఎంపిక చేసుకుని ఘనవిజయం సాధించారు.
ఇప్పుడదే విధానాన్ని తెలంగాణ టీడీపీలోనూ ప్రయోగించారు చంద్రబాబు. టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికలో సీనియర్ల నుంచి చిక్కులు ఎదురవడంతో సరికొత్త ఎత్తువేసిన బాబు, ఎవరికీ నొప్పి కలుగకుండా టెక్నాలజీని ఆశ్రయించారు, ముఖ్యంగా రేవంత్, ఎర్రబెల్లి నువ్వానేనా అన్నట్లు పోటీపడటం, రేవంత్ పై సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం ద్వారా మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు టీటీడీపీ అధ్యక్షుడ్ని డిసైడ్ చేస్తానని బాబు చెప్పడం అంతా సైలెంటైపోయారు. అయితే తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకెళ్లగలితే సత్తా, సమర్ధత రేవంత్ కే ఉందని, కార్యకర్తలు కూడా రేవంత్ వైపే మొగ్గుచూపుతున్నారని చంద్రబాబుకు తెలిసినా, సీనియర్లను నొప్పించకూడదని తెలివిగా ఐవీఆర్ఎస్ ను వాడుకున్నారు
అయితే ఐవీఆర్ఎస్ స్టిస్టం ద్వారా సేకరించిన సమాచారాన్ని చంద్రబాబు… టీటీడీపీ నేతల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి 4లక్షల మంది కార్యకర్తలుండగా, 50శాతానికి పైగా… రేవంత్ రెడ్డి పేరునే ప్రతిపాదించారట, కేవలం 20శాతం మాత్రమే ఎర్రబెల్లి వైపు మొగ్గుచూపగా, మిగతా 20-30శాతం కార్యకర్తలు వివిధ నేతల పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దాంతో మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు రేవంత్ కే పగ్గాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇది కార్యకర్తల అభిప్రాయం కనుక సీనియర్లు కూడా వ్యతిరేకించడానికి వీలుండదని బాబు వేసిన ఎత్తు ఫలించింది. అలా సీనియర్లకు చెక్ చెప్పిన చంద్రబాబు, తన మనోభీష్టం మేరకు రేవంత్ కు పగ్గాలు అప్పగించేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారని పార్టీ నేతలు అంటున్నారు.