మళ్లీ ‘నెంబర్ వన్‘ సీఎం రేసులో చంద్రబాబు
posted on Sep 19, 2015 4:22PM

నారా చంద్రబాబునాయుడు, పదేళ్ల క్రితం ఈ పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మారుమోగిపోయేది, ఒక్క ఏపీలోనే కాదు, దేశం మొత్తంమీదే ఆయనో సంచలనం, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి సైతం ఆయన పేరు సుపరిచితమే, అంతలా తన ఇమేజ్ పెంచుకున్నారు చంద్రబాబు. ఆయన పనితీరు మెచ్చుకోనివాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు, రాజకీయ ప్రత్యర్ధి, ప్రస్తుత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆయన డైనమిజాన్ని పొగిడినవాళ్లే, పాలనను కొత్త పుంతలు తొక్కించి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఘనత చంద్రబాబుది, నేను నిద్రపోను-మిమ్మల్ని నిద్రపోనివ్వనంటూ అహర్నిశలూ ఆంధ్రప్రదేశ్ డెవలప్ మెంట్ కోసం పరితపించిన ముఖ్యమంత్రి.
ఇప్పుడంటే మోడీ పేరు దేశంలో మారుమోగిపోతుంది గానీ, పన్నెండేళ్ల క్రితం చంద్రబాబు నామస్మరణ కనిపించేది,ఆనాటి ఎన్టీఏ ప్రభుత్వంలోనూ చక్రం తిప్పిన చంద్రబాబు, రాక్ స్టార్ సీఎంగా వెలిగిపోయారు. తన డైనమిజంతో దేశాన్నే తనవైపు తిప్పుకున్నారు, పరిపాలన అంటే ఇలాగుండానే విధంగా చేసిచూపించారు, ఒక స్టేట్ డెవలప్ కావడానికి ఏం చేయాలో అన్ని చేశారు, అలుపెరగకుండా 24గంటలూ కష్టపడ్డారు, ఐటీని అందిపుచ్చుకుని ప్రపంచాన్నే హైదరాబాద్ కి రప్పించారు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచారు, లక్షలాది మందికి ఐటీ ఉద్యోగాలు లభించేలా చేశారు, విజన్ 2020 పేరుతో భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లిన స్వాప్నికుడు చంద్రబాబు.
అయితే 2004లో అధికారం పోయాక పదేళ్ల సుదీర్ఘమైన గ్యాప్, ఇంతలోనే రాష్ట్ర విభజన, కట్టుబట్టలతో వెళ్లిపోయినట్లుగా నవ్యాంధ్ర పరిస్థితి, అందుకే మళ్లీ చంద్రబాబుకి పగ్గాలు అప్పగించారు ఆంధ్రా ప్రజానీకం, రాష్ట్ర విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రను గట్టెక్కించే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందనే నమ్మకంతో అధికారం కట్టబెట్టారు. అందుకే ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా చంద్రబాబు నవ్యాంధ్ర పునర్ నిర్మాణానికి నడుం బిగించారు, కేంద్రం నుంచి అనుకున్నంత సహకారం అందకపోయినా ఛాలెంజ్ గా తీసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కష్టాలొచ్చినప్పుడే ఎవరి సత్తా ఏంటో బయటపడుతుందంటారు, తన సత్తా ఏంటో పదేళ్ల క్రితమే దేశానికి తెలియజేసిన చంద్రబాబు, ఇప్పుడు మరోసారి రుచి చూపించేందుకు కష్టపడుతున్నారు.
అయితే పట్టిసీమతో చంద్రబాబుకు తొలి విజయం దక్కిందనే చెప్పాలి, దేశంలోనే తొలిసారి నదుల అనుసంధానం చేపట్టి దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న చంద్రబాబు, నవ్యాంధ్ర డెవలప్ మెంట్ కు భారీ లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు. ఒకవైపు ఏపీ కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు వేస్తూనే, దేశీయ, విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించడంలో సక్సెస్ అవుతున్నారు. చంద్రబాబు ప్రయత్నాలకు ప్రపంచ బ్యాంక్ కూడా కితాబివ్వడమే రుజువు, రాష్ట్రం విడిపోయినా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం అంటూ సెకండ్ ర్యాంక్ ఇవ్వడం బాబు పనితీరుకు నిదర్శనం. ఇదే దూకుడుతో ముందుకెళ్తే ఏపీ మళ్లీ ఫస్ట్ ప్లేస్ కి రావడం, చంద్రబాబు నెంబన్ సీఎం కావడం కష్టమేమీ కాదేమో.