బదిలీల వ్యవహారమే కొంపముంచిందా?
posted on Sep 19, 2015 12:39PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం కేఈ మధ్య అంతరం రోజురోజుకీ పెరుగుతుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అటు చంద్రబాబును, ఇటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్న కేఈని ఇంటికి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. అందుకే ప్రతి సమీక్షా సమావేశంలోనూ అవసరం ఉన్నా లేకున్నా రెవెన్యూశాఖ ప్రస్తావన తీసుకొచ్చి, అవినీతి పెరిగిపోయిందంటూ కేఈకి డేంజర్ సిగ్నల్స్ పంపిస్తున్నారని అంటున్నారు. మరోవైపు కేఈని అటు మంత్రిగా, ఇటు శాఖాపరంగా డమ్మీని చేసేశారని, ఇక సాగనంపడమే మిగులుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి ఊతమిచ్చేలా చంద్రబాబు చర్యలున్నాయని, అందుకే రెవెన్యూ వ్యవహారాలన్నీ మంత్రి నారాయణ చక్కబెట్టేస్తున్నారని, దాంతో కేఈ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెబుతున్నారు.
అయితే దీనంతటికి డిప్యూటీ కలెక్టర్ల బదిలీల వ్యవహారమే కారణమంటున్నారు పార్టీ నేతలు, కేఈ తీసుకున్న నిర్ణయం చినబాబుకు నచ్చలేదని, పైగా లోకేష్ చెప్పినా వినకపోవడంతో తేడాలొచ్చాయని, అది చివరికి కేఈ పదవికే ఎసరు తెచ్చిపెట్టే పరిస్థితికి వచ్చిందంటున్నారు. అయితే కేఈ వాదన మరోలా ఉంది, తాను రూల్స్ ప్రకారమే వ్యవహరించానని, ఏళ్ల తరబడి పాతుకుపోయిన వాళ్లను బదిలీ చేశానని, అక్కడక్కడా పార్టీ నేతలు సూచించినట్లు వ్యవహరించానని వివరణ ఇచ్చారట. కానీ ఆ లిస్ట్ లో టీడీపీ సానుభూతిపరులు కూడా ఉన్నారని, వాళ్లను ట్రాన్స్ ఫర్ చేయడానికి వీల్లేదని కొందరు నేతలు చినబాబుకు ఫిర్యాదు చేయడంతోనే కథ అడ్డంతిరిగిందంటున్నారు. దాంతో బదిలీలపై కేఈ నాలుగు జీవోలు ఇష్యూ చేస్తే, ప్రధాన కార్యదర్శితో చెప్పి ఒకే ఒక్క జీవోతో వాటిని ఆపేశారు చంద్రబాబు.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేది ఒక్క కేఈ మాత్రమేనని, అందుకే సీఎంకు కూడా చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, అదే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టిందని అంటున్నారు. పైగా మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిర్ణయాలపైనా అనేకసార్లు కేఈ విమర్శలు చేయడం కూడా చంద్రబాబుకి నచ్చలేదని, అనేకసార్లు హెచ్చరించినా కేఈ వైఖరి మారలేదని, ఇక సాగనంపడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి.