గులాబీ కార్లో సీటు దొరకని రాజయ్య

 

టీ-కాంగ్రెస్ నేతలు కేశవ్ రావు, వివేక్, మందా జగన్నాధంలకు వారి పుత్రరత్నాలకు కూడా కేసీఆర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ క్రింద పార్టీ టికెట్లు, పదవులు హామీలు ఈయడంతో వారు (ఉద్యమాన్నిబలపరిచేందుకు) తెరాసలోకి వెళ్ళడం ఖాయం అయిపోయింది. ఇక మరో టీ-కాంగ్రెస్ యంపీ రాజయ్యకు కూడా ఉద్యమం బలపరచాలని గట్టిగా కోరిక ఉన్నపటికీ టికెట్ దొరకకపోవడంతో గులాబి కారెక్కలేకపోయారు.

 

రాజయ్య వరంగల్ నుండి డిల్లీకి టికెట్ తీసుకొందామనుకొన్నారు. కానీ, దానిని కడియం శ్రీహరికి ఇస్తానని చెప్పి పార్టీలోకి తీసుకువచ్చినందున, మానకొండూరు నుండి హైదరాబాద్(అసెంబ్లీ)కి మాత్రమే టికెట్ ఇవ్వగలనని కేసీఆర్ చెప్పారు. దానితో చిన్నబుచ్చుకొన్న రాజయ్య డిల్లీ టికెట్ దొరికే వరకు అమ్మహస్తం పట్టుకొనే నడవాలని ఫిక్స్ అయ్యారు.

 

కానీ, కిరణ్, బొత్స ఇద్దరూ కూడా ‘బయటకు పోయే వాళ్ళు ఎంచక్కా పోవచ్చునని’ ఇప్పటికే స్పష్టం చేసారు కనుక, కధ ఇంతవరకు వచ్చిన తరువాత ఆయన బొత్స హస్తం పట్టుకొన్నా, కిరణ్ హస్తం పట్టుకొన్నా ప్రయోజనం లేదు. ఇక రాష్ట్రంలో, కేంద్రంలో కూడా తనకి మద్దతు ఇచ్చేవారు లేరని రాజయ్య గ్రహించగలిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దొరికినకాడికి ఏదో ఒక టికెట్ తీసుకొని సంతోషపడటమే బెటర్. లేకుంటే మున్ముందు హైదరాబాద్ టికెట్ కూడా దొరకకపోయే ప్రమాదం ఉంది.

 

ఇక, వరంగల్ టికెట్ వెనుక కేసీఆర్, హరీష్ రావుల మద్య ఏదో కోల్డ్ వార్ నడుస్తున్నట్లు కూడా కొన్ని పుకార్లు ఉన్నాయి. అదే నిజమయితే, రాజయ్య వారిరువురి మద్య నలిగిపోవడం కంటే, టులెట్ బోర్డు పెట్టుకొని అభ్యర్దుల కోసం ఎదురు చూస్తున్న బీజేపీలోకి జంపయిపోవడం ఇంకా మంచిది. కావాలంటే, ఆనక గెలిచిన తరువాత అప్పటి రాజకీయ పరిస్తితులను బట్టి ఏ పార్టీలోకి కావాలంటే ఆ పార్టీలోకి జంప్ అయిపోవచ్చును. ఇంకా తనకి రాజయోగం గాని పడితే, కేంద్రంలో బెజీపీ అధికారంలోకి వచ్చి ఆయన కేంద్ర మంత్రి కూడా అయిపోవచ్చును. బీజేపీ కూడా తెలంగాణా ఉద్యమం చేస్తోంది గనుక అందులో జేరడానికి శాస్త్రం అభ్యంతరం చెప్పదు. కాకపోతే ఆలశించిన ఆశాభంగం అనే సంగతిని ఆయన తెలుసుకోవడం చాల మంచిది.