బక్కన్నకి రాములమ్మ జలక్

 

ఒకవైపు తెలంగాణా ఉద్యమ సైన్యాదిపతి బక్కన్నకేసీఆర్, పార్టీలోకి రావడానికి చాలాకాలంగా మొరాయిస్తున్న ఇద్దరు టీ-కాంగ్రెస్ యంపీలను అతికష్టం మీద పార్టీలోకి లాక్కొని వచ్చేందుకు తిప్పలు పడుతుంటే, మరో వైపు ఆయనను నిత్యం అంటిబెట్టుకొని తిరిగే చెల్లెమ్మ రాములమ్మ వెళ్లి ముఖ్యమంత్రిని కలిసివచ్చి ఆయనకు జలక్ ఇచ్చింది.

 

తన మెదక్ సీటుపై కేసీఆర్ ఇంతవరకు స్పష్టమయిన హామీ ఏమీ ఈయకపోగా, దానిని పార్టీలోకి కొత్తగా జేరిన ఐఏయస్ ఆఫీసర్ రమణాచారికి అప్పగించేందుకు బ్రదర్ బక్కన్న డిసైడ్ అయినట్లు కనిపెట్టింది చెల్లెమ్మ. అందువల్ల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మేలనుకొని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలో తన సరికొత్త అన్నగారిని చూసుకొన్న రాములమ్మ, కాంగ్రెస్ కండువా ఇస్తే కప్పుకోవడానికి తాను సిద్దం అని స్పష్టమయిన సంకేతం ఇచ్చి వచ్చింది.

 

అయితే శంఖంలో పోస్తే గానీ నీళ్ళు తీర్ధం కావు గనుక అమ్మహస్తం పట్టుకొని తిరుగుతున్నకిరణన్నగారు తనకి అభయ హస్తం ఇచ్చేవరకు ఎటువంటి (ఇందిరమ్మ) కలలు కనడం మంచిది కాదని ఆమెకు తెలుసు గనుక, ముఖ్యమంత్రితో తన భేటీని అపార్ధం చేసుకొని రాజకీయం చేయవద్దని, తానూ కేవలం తన మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మెదక్- అక్కన్నపేట రైల్వే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరడానికే మాత్రమె ఆయనను కలిసానని ఆమె సంజాయిషీ ఇచ్చుకొన్నారు. అయితే తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగుతున్నానని చెప్పినా నమ్మని జనం ఆమె మాటలని నమ్మడం లేదిప్పుడు.

 

ఆమె గతంలోనే ఒకసారి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని కలిసివచ్చినపటికీ కాలం కలిసి రాకపోవడంతో వెనక్కి తగ్గింది. ఆ తరువాత కిషన్ రెడ్డికి రాఖీ కట్టి బీజేపీలో చేరుదామని చెల్లెమ్మ కొంచెం ఊగిసలాడినా మళ్ళీ బక్కన్నకన్విన్స్ చేసేయడంతో ఇంతవరకు తెరాసనే అంటిపెట్టుకొని ఉంది. కానీ, తన బక్కన్నమళ్ళీ తనకి హ్యాండిస్తునట్లు అనుమానం రాగానే, ఎందుకయినా మంచిదని కిరణన్నని కలిసి తన కర్తవ్యం తానూ నిర్వర్తించి వచ్చింది.

 

మరి తన బక్కన్న, కిరణన్నలలో ఎవరు ఆమెచేత రాఖీ కట్టించుకొని ఆమెకు మెదక్ లోక్ సభ టికెట్ గిఫ్టుగా ఇస్తారో చూడాలి మరి.