కోనేరు హంపిని ఓడించి చెస్ ప్రపంచ విజేతగా నిలిచిన దివ్వదేశ్‌ముఖ్
posted on Jul 28, 2025 6:30PM

తనకంటే ఎంతో సీనియర్ అయిన కోనేరు హంపిని ఓడించి ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ విజేతగా దివ్య దేశ్‌ముఖ్ నిలిచింది. తాజాగా (28-7-25) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోనేరు హంపిపై దివ్య దేశ్‌ముఖ్ విజయం సాధించింది. ఈ విజయంతో 19 ఏళ్ల దివ్య భారతదేశానికి చెందిన ఎనభై ఎనిమిదో గ్రాండ్ మాస్టర్‌గా అవతరించింది. దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జరిగిన తొలి ర్యాపిడ్ ట్రై బ్రేకర్ డ్రాగా ముగిసింది.
అయితే ఆ తర్వాత రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో కోనేరు హంపిపై దివ్య గెలుపొందింది.
2025 ఫిడే మహిళల ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా దివ్య నిలిచింది. చివరకు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో దివ్యకు 1.5 పాయింట్లు లభించగా, కోనేరు హంపికి 0.5 పాయింట్లు వచ్చాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దివ్యకు హంపీ గట్టి పోటీనిచ్చింది. దీంతో ఫలితం ట్రైబ్రేకర్‌కు చేరింది. సోమవారం దూకుడుగా ఆడిన దివ్య టోర్నీ విజేతగా నిలిచి గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకుంది.
నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ సీనియర్ విభాగంలో చాలా తక్కువ టోర్నీలు మాత్రమే ఆడింది. కోనేరు హంపితో పోల్చుకుంటే దివ్య అనుభవం చాలా తక్కువ. ఈ టోర్నీకి ముందు ఆమెకు గ్రాండ్ మాస్టర్ హోదా కూడా లేదు. 2021లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను పొందిన దివ్య.. 2023లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. అలాగే ఒలింపియాడ్‌లో మూడు స్వర్ణ పతకాలను కూడా అందుకుంది. తాజా ప్రపంచకప్‌లో తనకంటే మెరుగైన రేటింగ్ ఉన్న ద్రోణవల్లి హారిక, జు జినర్ వంటి ప్రతిభావంతులను ఓడించి అందర్నీ ఆకట్టుకుంది.