ఊరకే డబ్బిస్తే వద్దన్న స్విస్ జనం..మీకు సలాం..!
posted on Jun 7, 2016 1:18PM

డబ్బు ఎవరికి చేదు చెప్పండి..మనిషి ఎంత కష్టపడినా డబ్బుకోసమే అలాంటిది ఫ్రీగా డబ్బులిస్తామంటే ఎవరు వద్దంటారు..! మన దగ్గరైతే ఎగిరి గంతేసి మరీ తీసుకుంటారు. కానీ స్విట్జర్లాండ్ ప్రజలు మాత్రం మాకు ఉచితంగా వచ్చే డబ్బు వద్దని తిరస్కరించారు. దేశంలో పేదరికం నిర్మూలించేందుకు ప్రతి పౌరుడికి జీవించేందుకు సరిపడా డబ్బు చెల్లించాలని స్విస్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వం ముందు ఈ ప్రతిపాదన తెచ్చింది. నిరుద్యోగం, స్థిరమైన ఉద్యోగాలు లేకపోవడం, పేదరికం పెరిగిపోతుండటం వంటి పరిణామాలను ఎదుర్కోవాలంటే ఈ పథకాన్ని అమలు చేయాలని కోరింది. కనీస ఆదాయాన్ని సమకూర్చడం వల్ల ప్రజలకు కొంత వెసులుబాటు ఉంటుందని తెలిపింది.
దీనిపై సుధీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వం "యూనివర్శిల్ ఇన్ కమ్ బేస్ ప్రపోజల్"ను అమలు జరపాలని స్విస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద పెద్దలకు 2500 స్విస్ ప్రాంక్‌లు అంటే మన కరెన్సీలో లక్షా 70 వేలు, పిల్లలకు 625 ఫ్రాంక్‌లు అంటే 42.5 వేలు చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకోసం దేశంలో "రెఫరెండం" నిర్వహించింది. 76.9 శాతం మంది ప్రజలు ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటేయగా..అనుకూలంగా కేవలం 23.1 శాతం మంది ఓటేశారు. ఫ్రీగా ఇచ్చి తమని బద్ధకస్తులుగా మార్చవద్దంటున్నారు. అటు మేధావులు, ఆర్థిక నిపుణులు మొదటి నుంచి ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
ఇలా ఉచితంగా అన్నీ ఇస్తే ధరలకు రెక్కలు వస్తాయని, ప్రజలు సామూహికంగా ఉద్యోగాలు వదిలేస్తారని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు దీని ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందన్నారు. అటు ఈ పథకం అమలైతే ఖజానాపై ఎంత భారం పడుతుందో ప్రజలు ముందుగానే అంచనా వేశారు. ఆ భారాన్ని మోయడానికి అదనపు ట్యాక్సులు వడ్డించడం, ప్రస్తుతం సంక్షేమ రంగంపై చేస్తున్న ఖర్చును తగ్గించడం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ముందుగానే అంచనా వేసిన ప్రజలు ప్రతిపాదనను తిరస్కరించినట్లున్నారు. స్విస్ ప్రజల తీర్పును మనం అక్షరాల ఆచరించాలి. ఎన్నికల్లో నాయకులు ఎరగా వేసే ఆల్‌ఫ్రీకి లొంగిపోయి గొర్రెల మందల్లా ఉచితం అంటే చాలు ఎగిరి గంతేసి పట్టం కడతాం. మాఫీ అంటే చాలు సదరు నేతే మా మహారాజు అని చెప్పేస్తాం. జనాన్ని బట్టే నాయకులు నడుచుకుంటారు. మనం ఫ్రీకి ఆశ పడితే..ఫ్రీగా మనల్ని వాడిపారేస్తారు. కాదని సతాయిస్తే చచ్చినట్లు మన దారికొస్తారు.