కేసీఆర్‌కు "సరైనోడు " కోదండరామేనా..?
posted on Jun 7, 2016 12:13PM
.jpg)
కేసీఆర్..టీఆర్ఎస్ అధినేతగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పార్టీని, ప్రభుత్వాన్ని చక్రవర్తిలా ఏలుతున్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమాన్ని తన శక్తియుక్తులతో నడిపి..ఎప్పటికి సాకారం కాదనుకున్న తెలంగాణ కలను సాకారం చేసిన ధీశాలి. దీంతో తమ తొలి అధినేతగా ఆయనకే పట్టం కట్టింది తెలంగాణ పౌర సమాజం. అప్పటి నుంచి బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తూ..వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తప్ప మరో పార్టీ లేకుండా చేస్తూ విజయవంతంగా దూసుకుపోతున్నారు గులాబీ బాస్. ఆయన తీసుకున్న నిర్ణయాలను కాదనేవారు అటు ప్రభుత్వంలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ ఇప్పుడు ఎవరు లేరు. దీంతో కేసీఆర్ ఆడింది ఆట..పాడింది పాటగా సాగిపోతోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్‌పై విమర్శల వర్షాన్ని కురిపించారు, తెలంగాణ పోలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రో.కోదండరామ్.
టీఆర్ఎస్ రెండేళ్ల పాలన సందర్భంగా కోదండరామ్, కేసీఆర్ పాలన తమకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందని, చేతకాకుంటే, తప్పుకోవాలని, అభివృద్ధిని తాము చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు. ప్రజలు బాగుండాలన్న కారణంగానే జేఏసీ ఇంకా పనిచేస్తోందని, లేకుంటే ఎప్పుడో టీఆర్ఎస్‌లో కలిపేవారమన్నారు. అంతే కేసీఆర్‌కు చిర్రెత్తుకొచ్చింది..అప్పటి దాకా పార్టీ శ్రేణుల్ని కోదండరామ్ విషయంలో సంయమనం పాటించాలని సూచించిన ఆయన..ఇప్పుడు తనమీదకే దూసుకొస్తుండటంతో పార్టీ శ్రేణుల్ని ఊసిగొలిపారు. దాని పర్యవసానమే నిన్న టీఆర్ఎస్ మంత్రులు, నేతల మాటల దాడి. కాంగ్రెస్ విమర్శించినా..టీడీపీ విమర్శించినా, బీజేపీ విమర్శించినా ఎవరిపైనా ఈ స్థాయిలో టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగలేదు. కానీ కోదండరాంపై ఇంతలా విరుచుకుపడటానికి కారణమేంటి..?
తెలంగాణలో టీఆర్ఎస్ అనంతరం మంచి పట్టున్న శక్తి టీజేఏసీ అనే చెప్పాలి. ఉద్యమం సమయంలో మాజీ మంత్రి జానారెడ్డికి అత్యంత సన్నిహితుడైన కోదండరామ్‌ని, కేసీఆర్ టీజేఏసీ ఛైర్మన్‌గా నిలబెట్టడంతో ఆయన చెలరేగిపోయారు. కోదండరాం ఛైర్మన్ గనుక ఆయన పిలుపుకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, ప్రజాసంఘాలు ఇలా మొత్తంగా తెలంగాణ సమాజం కట్టుబడి ఉండేది. ఫాలోయింగ్‌లో, తన దైన వ్యూహాలతో ఓ దశలో కోదండరామ్, కేసీఆర్‌ను మించిపోయారు. ఇలా గ్రామగ్రామన తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేశారు కోదండరామ్. దీంతో తెలంగాణ కల సాకారమయ్యింది. తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేశారు. అప్పటి నుంచి కోదండరామ్ కష్టాలు మొదలయ్యాయి. ఉద్యమంలో వాడుకుని, ఆయనంటే ఏ పార్టీకీ గిట్టని విధంగా మార్చేశారు కేసీఆర్.
అయితే సరైన సమయం కోసం వేచి చూసిన కోదండరామ్, రెండేళ్లపాలన సంబరాలను లక్ష్యంగా చేసుకుని వ్యూహం రచించారు. కోదండరామ్‌కు జనంలో మంచి క్రేజ్ ఉంది..ఆయన మాటలు నమ్మి జనం తిరగబడితే గులాబీ బాస్ అడ్రస్ గల్లంతే. జనం ఎదురుతిరిగితే ఏ ప్రభుత్వమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా నామరూపాల్లేకుండా పోతుంది. మేధావులు వాస్తవాలు జనం ముందు పెడితే, పాలకులకి కష్టకాలమే. ఇది గ్రహించిన కేసీఆర్, కోదండరామ్ గొంతు నొక్కాలని భావించి తన దండును ఫ్రోఫెసర్ మీదకు పంపారు. అయితే కేసీఆర్‌ను ఢీకొట్టగల సరైనోడు..సత్తావున్నోడు ఎవడొస్తాడా..? అని ఎదురూచూసిన ప్రతిపక్షాలకు ఆ సరైనోడు కోదండరామ్ అని అర్థమైంది. ఈ మాటల దాడితో ఎక్కడో పాతాళంలో ఉన్న కోదండరామ్‌కు ఎవరెస్ట్‌లాంటి పబ్లిసిటీ వచ్చింది.