హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రాణం తీసింది...!

కోటీ రూపాయల డబ్బు పొయినా పెద్దగా పట్టించుకోని నేటి యువత, తలలోంచి ఒక్క వెంట్రుక రాలితే మాత్రం తెగ బాధపడిపోతోంది. పని ఒత్తిడి, పోషకాహార లోపం తదితర కారణాలతో చిన్నవయసులోనే చాలా మంది యువతకు బట్టతల వచ్చేస్తుంది. నిద్రలేని రాత్రులు, జీవనశైలిలో వచ్చిన మార్పులు, పెరిగిన కాలుష్యం, ఒత్తిడి ఇలా కారణాలేవైతేనేం ఇటీవలి కాలంలో ఎక్కువ మంది హెయిర్‌లాస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ అందం చెడిపోకుండా ఉండాలని కొందరు..పెళ్లి కాకుండానే బట్టతల అయితే పిల్లనెవరిస్తారని మరి కొందరు ఇలా యువత హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్, హెయిర్ వీవింగ్ తదితర చికిత్సల వెంట పడుతున్నారు.

 

ఈ నేపథ్యంలో ఇలాగే జుట్టు కోసం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ట్రీట్‌మెంట్ వికటించి ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న ఒక మెడికోకు చిన్న వయసులోనే బట్టతల వచ్చింది. దీంతో అతను హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలనుకున్నాడు. వెంటనే మద్రాస్ నున్‌గంబాకమ్‌లోని ఒక సెలూన్‌ను సంప్రదించాడు. మే 17న అనస్థిస్ట్ డాక్టర్ హరిప్రసాద్, వైద్యుడు వినీత్ సూర్యకుమార్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేశారు. ఆపరేషన్ అయిన దగ్గరి నుంచి ఆ విద్యార్థి తీవ్ర ఇబ్బందులకు గురవ్వడంతో మళ్లీ హాస్పిటల్‌కే చేరుకున్నాడు. మళ్లీ ఏదో ట్రీట్ మెంట్ చేసి పంపించేశారు వైద్యులు. కాని ఒంట్లో తెలియని నలత, ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబసభ్యులు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ విద్యార్ధి మరణించాడు.

 

అయితే ఆ విద్యార్థిని పరీక్షించిన వైద్యులు అతనికి సర్జరీ జరిగిందని..కాని ఆ సర్జరీ సరిగా జరపలేదని చెప్పారు. దీంతో చనిపోయిన విద్యార్థి స్నేహితుల ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు డైరెక్టరేట్‌ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఆపరేషన్ జరిగిన రోజు అనస్థిస్ట్ డాక్టర్ హరిప్రసాద్ సర్జరీ మొదలైన కాసేపటికే వెళ్లిపోయాడు. ఒక అనస్థిస్ట్ సర్జరీ పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలి. అక్కడ ఇచ్చిన అనస్థిషీయా విద్యార్థి శరీర తత్వానికి సరిపోలేదని, అందువల్లే శరీరంలోని ప్రధాన అవయవాలు పనిచేయకపోవడంతో అతను మరణించాడు. ఇక ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన వైద్యుడు వినీత్ కేవలం ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమే, సర్జన్ కాదు. దీంతో తమిళనాడు మెడికల్ కౌన్సిల్ ఇద్దరు డాక్టర్లకు నోటీసులు పంపించారు. సర్జరీ చేయడానికి అర్హత లేకపోయినప్పటికి ఎందుకు సర్జరీ చేశారో చెప్పాలని నోటీసులో ప్రశ్నించారు. అలాగే సర్జరీ చేసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌కు కేవలం సెలూన్ పేరుతో లైసెన్స్ తీసుకున్నారు. అక్కడ సర్జరీ చేయడంపై కూడా వివరణ కోరారు. ఈ నేపథ్యంలో తమిళనాడు మెడికల్ కౌన్సిల్ సెలూన్‌ను సీజ్ చేసింది. జుట్టు వస్తుంది కదా అని అర్హత లేని వైద్యుల్ని ఆశ్రయించే యువతకు ఈ ఘటన ఒక గుణపాఠం .  జుట్టు దువ్వుకోవాలంటే ముందు ప్రాణముండాలి కదా..! అని ఒక్కసారి ఆలోచించండి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu