సోనియా, రాహుల్ కి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ
posted on Dec 8, 2015 7:15AM
.jpg)
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధిలకి డిల్లీ హైకోర్టులో నిన్న ఎదురు దెబ్బ తగిలింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకి ఇచ్చిన భారీ రుణానికి సంబంధించిన కేసులో వ్యక్తిగతంగా హాజరు అవడంపై తమకు మినహాయింపు ఇవ్వాలనే వారి అభ్యర్ధనను డిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో వారు నేరానికి పాల్పడినట్లు అనుమాన్నాలు ఉన్నందున కేసు విచారణకు వారు హాజరు కావలసిందేనని డిల్లీ హైకోర్టు ఆదేశించింది. దానిని సవాలు చేస్తూ వారిరువురూ ఇవ్వాళ్ళ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేయనున్నారు.
అసోసియేటడ్ జర్నల్ లిమిటడ్ అనే సంస్థకు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికకి 2010 సం.లో కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్లు రుణం ఇచ్చింది. ఆ తరువాత ఆ పత్రిక మూత పడింది. దాని నుండి ఆ సొమ్ముని వసూలు చేసుకొనే హక్కును రూ. 50 లక్షలకే కాంగ్రెస్ పార్టీ యంగ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థకు అమ్మేసింది. ఒక రాజకీయ పార్టీ ఒక మీడియా సంస్థకు అంత బారీ ఋణం ఇవ్వడం, దానిని వసూలు చేసుకొనే హక్కులని నామ మాత్ర ధరకే వేరొకరికి అప్పగించడం అంతా కూడా కాంగ్రెస్ నిధులను ఒక ప్రద్దతి ప్రకారం దారి మళ్ళించడానికి ఉద్దేశ్యించినవేనని ఇందులో సోనియా, రాహుల్ గాంధీలే ప్రయోజనం పొంది ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కేసు వేశారు. దానిపై విచారణ చేసిన ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వారిరువునీ స్వయంగా కోర్టుకి హాజరుకమ్మని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. అప్పుడు వారిరువురూ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయగా హైకోర్టు కూడా వారు స్వయంగా హాజరు కావలసిందేనని తీర్పు చెప్పింది. కనుక వారు ఇప్పుడు ఆ హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాలు చేయబోతున్నారు.