అవినీతిపై ఉపేక్ష తగదు!
posted on Dec 8, 2015 8:53AM

నకిలీ పాస్ బుక్ లతో బోగస్ రుణాలు పొందిన వైనాలు వెలుగులోకి వచ్చి సంవత్సరంపైగా అవుతుంది.ఇంకా బయటపడుతూనే ఉన్నాయి.ఇలాంటి అక్రమాలకు పాల్పడినవారిని గుర్తించి,శిక్షించటంలో అన్ని స్థాయిల్లో పూర్తి నిర్లక్ష్యం కనపడుతున్నది.తాజాగా ఆర్.బి.ఐ.వారు ఈ నేరాలకు బాధ్యులెవరంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖను వివరణ కోరటం అందుకు వారు ఈ పాస్ వ్యవస్థను తీసుకువచ్చామని ఇక ముందు జరగవని చెప్పటం విచిత్రంగానూ,హాస్యాస్పదంగానూ ఉంది.ఇలా అక్రమాలకు పాల్పడినవారు ఏ రాజకీయ పార్టీ నేత పంచనో చేరి మరిన్ని అక్రమాలకు పాల్పడుతున్నాడు!అందుకు మన లంచగొండి వ్యవస్థ యధాశక్తి సహకరిస్తున్నది! నకిలీ నెయ్యి కుంభకోణమే ఇందుకు తాజా ఉదాహరణ!రాజకీయ వ్యవస్థ, అధికార వ్యవస్థ,పోలీసు వ్యవస్థ,న్యాయ వ్యవస్థ పూర్తిగా దిగజారి నిర్వీర్యమైపోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు!కేంద్ర న్యాయ పరిశోధనా సంస్థల్లో సిబ్బంది కొరత ఏళ్ళ తరబడి కొనసాగుతోంది.నేరాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ఇదేం దౌర్భాగ్యం?సమాజ హితం కోరుతున్నవారంతా కూడా ఉదాసీనాన్ని వదలి పాలకుల్లో మార్పుకు, ఒత్తిడి పెంచటానికి ముందుకు రావాలి! అవినీతిపై ఉపేక్ష అంటే అవినీతిని ప్రోత్సహించటమే!
గరిమెళ్ళ రామకృష్ణ