నేను అలాగా అనలేదు, కానీ క్షమాపణలకి సిద్దం: కమల్ హాసన్
posted on Dec 7, 2015 8:52PM
.jpg)
నటుడు కమల్ హాసన్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలను చూసి అధికార అన్నాడి.ఎం.కె. నేతలు ఆయనపై విరుచుకు పడ్డారు. తన వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు అంత తీవ్రంగా స్పందిస్తారని ఊహించని కమల్ హాసన్ కంగారు పడినట్లున్నారు. వెంటనే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకొన్నారు.
"ఒక మిత్రుడుకి వ్రాసిన లేఖలో చెన్నై పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసాను తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని అనలేదు. నేను ఎవరినీ విమర్శించలేదు.. తప్పులు పట్టలేదు. మీడియాలో నా లేఖలో కొంత భాగం మాత్రమే ప్రచురితమయింది. అది కూడా వక్రీకరించబడింది. అయినప్పటికీ ఒకవేళ నా లేఖ వలన ఎవరికయినా బాధ కలిగించినట్లయితే అందుకు క్షమాపణలు తెలపడానికి సిద్దంగా ఉన్నాను,” అని కమల్ హాసన్ అన్నారు.
"మళ్ళీ ఇప్పుడు కూడా పన్నీర్ సెల్వం నాపై చేసిన విమర్శలకి జవాబుగా నేను ఈ వివరణ ఇవ్వడంలేదు. కేవలం నా అభిమాన సంఘాలలో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అయోమయం ఏర్పడకూడదనే ఉద్దేశ్యంతోనే వివరణ ఇస్తున్నాను. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని నా అభిమాన సంఘాలను, విమర్శకులను కోరుతున్నాను,” అని అన్నారు కమల్ హాసన్.