ఉన్నతాధికారుల సత్వర స్పందన.. మహిళకు పునర్జన్మ
posted on Oct 5, 2025 9:08AM
.webp)
ఉన్నతాధికారులు సమష్టిగా సత్వరం స్పందించడంతో ఓ మహిళ ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన విజయవాడలో శనివారం (అక్టోబర్ 4) చోటు చేసుకుంది. విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు ఆ సందర్భంగా జరిగిన సభలో విజయవాడ వాంబే కాలనీకి చెందిన నాగజ్యోతి అనే మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె ఆ సభకు మానసిక వికలాంగురాలైన తన ఐదేళ్ల కుమార్తెకు ప్రభుత్వ సాయం అర్థించడానికి వచ్చింది.
అయితే సభ జరుగుతుండగా ఆమె ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. నాగజ్యోతి ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం గమనించిన పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా వెళ్లి అంబులెన్స్ తీసుకు వచ్చారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ సరిత ఆమెకు సపర్యలు చేశారు. అరికాళ్లపై గట్టిగా రుద్దుతూ ఆమె శరీరం చల్లబడిపోకుండా చర్యలు తీసుకున్నారు. సభలోనే ఉన్న డీఎంహెచ్ ఓ సుహాసిని పరుగు పరుగున బాధితురాలి వద్దకు చేరుకున్నారు. ఆమె నాడి అందకపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని గ్రహించారు. నాగజ్యోతి సెరిబ్రల్ ఎనాక్సియాకు గురైనట్లు గుర్తించి వెంటనే ఆమె కాళ్లను తన భుజంపైకి పెట్టుకుని మెదడుకు ఆక్సిజన్ అందేలా చేశారు. దీంతో బాధితురాలిలో నాడీ స్పందనలు మొదలయ్యాయి.
వెంటనే ఆమెను అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అవసరమైన చికిత్స అందించారు. ప్రస్తుతం నాగజ్యోతి ఆరోగ్యం నిలకడగా ఉంది. హోదాలను పక్కన పెట్టి ఉన్నతాధికారులు సమష్టిగా సత్వరమే స్పందించి నాగజ్యోతికి పునర్జన్మ ప్రసాదించారంటూ ప్రజలు అధికారులను ప్రశంసిస్తున్నారు.