రజనీకాంత్‌కి చంద్రబాబు....అంటే ఎందుకంత ఇష్టం!?
posted on Dec 12, 2025 12:09PM

ఏ ట్రిబ్యూట్ టు తలైవ అంటూ షారుక్ ఖాన్ తన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో లుంగి డ్యాన్స్ పెట్టాడంటే.. పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే ఖాన్ త్రయంలో ఒకరైన షారుక్ కి బాలీవుడ్ బాద్షా వంటి బిరుదులున్నాయి. అంటే ఆయన మార్కెట్ రజనీ మార్కెట్ కన్నా ఎంతో పెద్దది. ఆయన నెట్ వర్క్, నెట్ వర్త్ ఎంత లార్జ్ అయినా సరే రజనీకాంత్ కి ఎంత విలువ ఇచ్చారో చెప్పడానికిదో మచ్చు తునక.
ఇది ఎప్పుడో పాతకాలం ముచ్చటే కాదనడం లేదు. కానీ రజనీకి బాబా సినిమా కాలం నాటి నుంచే దేశ విదేశీ అభిమాన భక్తులున్నారు. తొలి దక్షిణాది పాన్ వరల్డ్ సూపర్ స్టార్ రజనీకాంతంటే అతిశయోక్తి కాదేమో. అంతగా రజనీకాంత్ తనదైన ఫ్యాన్ మెయిల్ ప్రపంచమంతా పరిచేశారు. ఇక తమిళులు అధికంగా ఉండే మలేసియా, సింగపూర్ లో ఆయన అభిమానగణం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
నటన పరంగా కమల్ హాసన్ ని కొట్టే వాడు లేక పోయినా.. ఆయనంత అందం, అభినయం లేక పోయినా తనదైన స్టైల్లో రజనీ మాస్ ప్రేక్షక జనాన్ని ఆకట్టుకోవడం పీహెచ్డీ చేయదగ్గర సబ్జెక్ట్ గా చెప్పక తప్పదు. ఇక రజనీకాంత్ జాలి, దయ.. దాన గుణాల గురించి చెబితే ఒక నాన్ డీటైల్డ్ బుక్ లో పెట్ట దగ్గ అతి పెద్ద పాఠమే అవుతుంది. తనను తొలినాళ్లలో ఆదరించిన వారెవరినీ ఆయన మరచి పోలేదంటారు.
తాను వేషాల కోసం వెతుక్కుంటున్న రోజుల్లో పూటగడవని పరిస్థితుల్లో కాసింత ఎక్కువ ప్రసాదం పెట్టిన పూజారి రజనీకి ఇంకా గుర్తే. తన డ్రైవర్ ఇంటికి చాటుగా వెళ్లి వారికి కొత్త ఇల్లు కొనిచ్చిన రజనీ దాతృత్వం కూడా చాలా చాలా పెద్దది. రజనీకి ఎదురుపడ్డ ఎవరైనా సరే, లబ్ధి పొందాల్సిందేనంటారు. అంతగా ఆయన ఫీలవుతారని చెబుతారు. ఈ సందర్భంగా ఇక్కడ చెప్పొచ్చో లేదో తెలీదు కానీ ఆయన ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మోహన్ బాబు గెస్ట్ హౌసుల్లో దిగుతుంటారు. రాత్రి పూట సిట్టింగ్ కి ఏర్పాట్లు చేసే ఆఫీసు బాయ్ కి కూడా ఆయన 500లో, వయ్యో చేతిలో పెడతారట. ఈ విషయం ఆ ఆఫీస్ బాయ్ గర్వంగా చెప్పుకుంటాడు.
ఇక సింప్లిసిటీ విషయంలో రజనీ తర్వాతే ఎవరైనా. ఒక సాదా సీదాగా కృష్ణానగర్, ఇంద్రనగర్ గడ్డ మీద సాయం కాలం వేడి వేడి పునుగులను తిన్న ఉదంతాలున్నాయి. ఒక సాధారణ ప్రయాణికుడిలా.. హిమాలయాలకు వెళ్లడం వంటి వార్తలను తరచూ వింటూనే ఉంటాం. ఆయన మొన్నా మధ్య శ్రీశైలం వెళ్లి అక్కడ దర్శనం ముగిశాక.. రోడ్డుపై కూర్చుని ఉంటే, ఒక మహిళా భక్తురాలు పది రూపాయలను దానం చేసిందన్న వార్త గుప్పు మంది. దీన్నిబ్టటీ ఆయన ఎంత సింపుల్ గా కనిపిస్తారో చెప్పొచ్చు.
ఇలా చెప్పుకుంటూ పోతే రజనీకాంత్ గురించిన విశేషాలు కోకొల్లలు. దాదాసాహేబ్ తో పాటు పలు పద్మ అవార్డులతో పాటు ఇంకా ఎన్నో ఘనకీర్తులు సాధించిన రజనీకాంత్ మార్కెట్ స్టామినా ఎంత స్ట్రాంగ్ అంటే రీసెంట్ గా ఆయన జైలర్ అనే మూవీ రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సూపర్ స్టార్ ఈజ్ ఆల్వేస్ సూపర్ స్టార్ అన్న పేరు సాధించారు.
75 ఏళ్ల వయసులోనూ ఇంకా మార్కెట్ రారాజుగా వెలుగొందే రజనీకాంత్ రాజకీయంగా అడుగులు వేయాలని భావించారు. కానీ, ఆయన తమిళనాడు లోకల్ కాదు. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో పెరిగిన వాడు కావడం వల్ల... ఆయనకు తమిళనాట రాజకీయం చేయడానికి తగిన పరిస్థితులు అనుకూలించలేదు.
రజనీకాంత్ అంటే చప్పున గుర్తుకు వచ్చేది ఒకటి ఉంది. అదే కండక్టర్ టు సూపర్ స్టార్ గా ఆయన ఎదుగుదల దాని పరిణామ క్రమం. అంతే కాదు.. తొలినాళ్లలో నెగిటవ్ కేరెక్టర్స్ కెరీర్ స్టార్ట్ చేసి ఆపై ఒకానొక సూపర్ స్టార్ గా ఎదగడం ఎలా.. అన్నది. ఈ విషయంలో ఆయనొక రూట్ మ్యాప్ వేసి సినీ గైడ్ గా అవతరించారనడం అబద్దం కాదేమో. ఈ పంథాలో తెలుగులో చిరంజీవితో పాటు మరెందరో తమిళ, మలయాళ, కన్నడ హీరోలు సైతం ఫాలో అయ్యారంటే అతిశయం కాదు.
ఇక 1995లో విడుదలైన రజనీకాంత్- బాషా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే అది తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ అన్న భాషా బేదాల్లేకుండా ఇరగదీసేసింది. ఆ తర్వాత బాషాలాంటి ప్యాట్రన్ తో వచ్చిన సినిమాల పరంపర కూడా లెక్కలేనన్ని. ఇదొక సక్సెస్ ఫుల్ సినీ ఫార్ములాగానూ చెలామణి అయ్యిందంటే అర్ధం చేసుకోవచ్చు ఇంపాక్ట్ ఆఫ్ రజనీకాంత్ ఆన్ సౌత్ సినిమా పవరేంటో.
తెలుగు రాజకీయాలతో కూడా రజనీకాంత్ కి దగ్గర సంబంధాలుంటాయి. ఇటీవల ఆయన ఏపీలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. బేసిగ్గా రజనీకాంత్ తాను రాజకీయాల్లో రాణించలేక పోయినా.. చంద్రబాబు, ఆయన మార్క్ పాలిటిక్స్ అంటే ఎంతో విలువనిచ్చి మద్దతు ప్రకటిస్తారు. గతంలో చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండటం కూడా రజనీతో పరిచయానికి ఒక కారణంగా చెబుతారు కొందరు.
దానికి తోడు ఒకానొక రోజుల్లో సీఈఓ ఆఫ్ ద స్టేట్ గా చంద్రబాబు రాజకీయాలకు అతీతంగా సాధించిన ప్రపంచ ప్రఖ్యాతి సైతం రజనీకీ బాగా ఇష్టం. అందుకే ఆయన బాబును ఎంతగానో అభిమానిస్తారు. తనకు కోట్లాది మంది అభిమానులున్నా.. తాను మాత్రం బాబుకు పెద్ద ఫ్యాన్ అంటూ బాహటంగానే ప్రకటిస్తారు రజనీకాంత్. తమిళనాడు రాజకీయాల్లో రజనీ ప్రభావం ఎంత అంటే సాక్షాత్ ప్రధాని మోడీయే పంచ కట్టుకుని రజనీని వచ్చి కలిశారంటే దటీజ్ మేజిక్ ఆఫ్ సూపర్ స్టార్. అలాంటి రజనీకాంత్ ప్రస్తుతం నార్త్ లో బిగ్ బీ అమితాబ్ ఎలా నాన్ స్టాప్ సినీ మారథాన్ చేస్తున్నారో.. సౌత్ లో అక్కినేని తర్వాత అంతటి మూవీ మారథాన్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ రజనీకాంత్. హ్యాపీ బర్త్ డే రజనీ సార్!