రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకమేనా?
posted on Sep 22, 2015 1:52PM

ఓబీసీల్లో చేర్చాలంటూ గుజరాత్ లో పటేళ్లు ఉద్యమిస్తున్న నేపథ్యంలో ఎవరికివాళ్లు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు.రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి? ఎంతకాలం ఇవ్వాలి? అనే అంశాలపై కమిటీ వేయాలంటూ ప్రధాని మోడీకి ఆరెస్సెస్ అధిపతి మోహన్ భగవత్ సూచించిన నేపథ్యంలో రిజర్వేషన్లపై అన్ని పార్టీల్లో విస్తృత చర్చ జరుగుతోంది, ప్రతి ఒక్కరూ బహిరంగంగా తమ నోరు విప్పుతున్నారు, నిర్దిష్ట కాలపరిమితి వరకే రిజర్వేషన్లను అమలు చేయాలని రాజ్యాంగ నిర్మాతలు కూడా సూచించారనే గుర్తుచేస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా రిజర్వేషన్ల విధానంపై స్పందిస్తున్నారు, ఎన్నాళ్లీ రిజర్వేషన్లు అంటూ ప్రశ్నిస్తున్నారు, 21వ శతాబ్దంలోనూ రిజర్వేషన్లు ఉండాలా? ఒకవేళ ఉంటే...ఏవిధంగా ఉండాలనేదానిపై సమీక్ష అవసరమని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు వద్దన్న తివారీ...దారిద్ర్యం, ఆర్ధిక వెనుకబాటు ఆధారంగా మాత్రమే కోటా అమలు చేయాలన్నారు. వర్గం, కులం, మతాలకు అతీతంగా...ఆర్ధికంగా వెనుకబడిన వారందరికీ రిజర్వేషన్ల ఫలాలు అందాలన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేతలు జితిన్ ప్రసాద్, జనార్దన్ ద్వివేది కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తంచేశారు, రిజర్వేషన్లతో అగ్రవర్ణాల్లోని పేదలు ఇబ్బందులు పడుతున్నారని, తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే భావన, ఆందోళన, ఆక్రోశం పెరిగిపోతుందని వ్యాఖ్యానించారు. దీనిపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని, అయితే తాను కుల రిజర్వేషన్లు తొలగించాలని కోరడం లేదని, అవసరం లేనివారికి కోటా రద్దు చేయాలని మాత్రమే కోరుతున్నానన్నారు ద్వివేది. అయితే మనీశ్, జితిన్, ద్వివేది అభిప్రాయాలు...వ్యక్తిగతమంతూ కాంగ్రెస్ అధిష్టానం తేల్చేసింది, దాంతో కాంగ్రెస్ స్టాండ్ ఏంటో క్లారిటీ లేకపోయినప్పటికీ, ఇన్ డైరెక్ట్ గా అగ్రవర్ణాలను తమవైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగానే వాళ్లతో ఈ వ్యాఖ్యలు చేయించిందనే టాక్ వినిపిస్తుంది.
అయితే మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ,ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నాయని ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ, ఎంఐఎం లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి.