బి.సి.సి.ఐ.లో డర్టీ గేమ్స్
posted on Sep 22, 2015 8:16PM
.jpg)
జగ్మోహన్ దాల్మియా మరణించడంతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ పై పట్టు సాధించేందుకు అప్పుడే రాజకీయపార్టీలు పావులు కదపడం మొదలుపెట్టాయి. అనారోగ్య కారణంగా దాల్మియా చాలా రోజులుగా తన విధులకు హాజరుకానప్పుడు బీజేపీ ఎంపీ మరియు బి.సి.సి.ఐ. కార్యదర్శి అనురాగ్ టాకూర్ ఆ బాధ్యతలను నిర్వహించేవారు. కనుక ఇప్పుడు ఆయన బి.సి.సి.ఐ. అధ్యక్ష పదవికి రేసులో పోటీ పడుతున్నారు. అధికార పార్టీకి చెందినవారు కావడం ఆయనకు కలిసివచ్చే అంశం.
వృదాప్యం, అనారోగ్య కారణాలుగా రాజకీయాల నుండి రిటైర్ అవ్వాలనుకొంటున్న ఎన్సీపి అధినేత శరద్ పవార్ కూడా బి.సి.సి.ఐ. అధ్యక్ష పదవి చేప్పట్టాలని తహతహలాడుతున్నారు. రాజకీయాలతో బాటు క్రికెట్ బోర్డుపై కూడా చాలా కాలంగా పెత్తనం చేస్తున్న ఆయన తనకున్న పరిచయాలు, పరపతిని ఉపయోగించుకొని అధ్యక్షుడుగా ఎన్నికయ్యేందుకు తెర వెనుక పావులు కదుపుతున్నారు. చాలా కాలంగా బి.సి.సి.ఐ. అధ్యక్ష పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నసీనియర్ కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా కూడా ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
మరో రెండు వారాల్లోగా బి.సి.సి.ఐ. జనరల్ బాడీ సమావేశం నిర్వహించబడుతుంది. అందులో అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. కానీ ఆలోగా తెరవెనుక పావులు కదిపి బోర్డు సభ్యులు అందరినీ ఎవరు తమ వైపు త్రిప్పుకోగలరో వారే అధ్యక్షులుగా ఎన్నుకోబడుతారు. అందుకే ముగ్గురూ ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టేశారు. క్రికెట్ ఆటకి ‘జెంటిల్ మెన్స్ గేమ్’ గా పేరుంది. కానీ ప్రస్తుతం బి.సి.సి.ఐ. బోర్డులో రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, తెర వెనుక రహస్య మంతనాలతో ఒక డర్టీ గేమ్ సాగుతోంది.