శ్రీవారికి భారీ బంగారు కానుక
posted on Sep 24, 2025 8:51PM
.webp)
తిరుమల శ్రీవారికి వైజాగ్‌కు చెందిన హిందుస్థాన్ ఎంటర్ ప్రైజెస్ ఎండి పువ్వాడ మస్తాన్ రావు, కుంకుమ రేఖ దంపతులు భారీ బంగారు కానుక అందించారు. రూ.3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని స్వామి వారికి బహూకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. దాతలను అభినందించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారాం పాల్గోన్నారు.
మరోవైపు బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అశోక్ సింఘాల్ పర్యవేక్షణలో వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఎగురవేశారు.
ధ్వజస్తంభంపై ఎగిరే ఈ గరుడ పతాకమే బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా సకల దేవతలను, అష్టదిక్పాలకులను, ఇతర గణాలను ఆహ్వానించే శుభ సూచికమని అర్చకులు వివరించారు. ధ్వజారోహణం అనంతరం శ్రీ మలయప్ప స్వామి వారు ఏడు తలల పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.