పవన్ కళ్యాణ్‌కి మెలకువ వచ్చింది

 

సినిమాల పరంగా, వ్యక్తిగత జీవిత పరంగా ‘ఖుషీ’గా వున్న పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు రాజకీయ రంగం మీద కూడా ఓ లుక్కేసి మళ్ళీ, తన సినీ, వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోతూ వుంటారు. ఒక విధంగా చెప్పాలంటే, ఇలాంటి ఆర్టిస్టులు రాజకీయాల్లో ‘గెస్ట్ ఆర్టిస్టు’లుగానే వుంటేనే దేశానికి మంచింది. అప్పుడెప్పుడో ఏపీ రాజధాని భూములున్న గ్రామాలకు వెళ్ళి ఏవేవో ప్రగల్భాలు పలికి, తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత నాలుక్కరుచుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పెద్దగా బయట కనిపించింది లేదు. రాజధాని రైతులకు అన్యాయం జరిగితే తాను రంగంలోకి దిగి పోరాటం చేస్తానని పెద్ద పెద్ద స్టేట్‌మెంట్లు ఇచ్చారాయన. అయితే రాజధాని గ్రామాల్లోని రైతులకు ఎలాంటి అన్యాయం జరగలేదు కాబట్టి ఆయన పోరాటం చేయాల్సిన అవసరం రాలేదు అది వేరే సంగతి. అయితే పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా ఎక్కడికో వెళ్ళిపోవాలన్న కోరిక మనసులో బలంగా వుంది. తన ‘అన్నయ్య’ చిరంజీవి సాధించలేకపోయిన ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న కోరిక కూడా ఉంది. అయితే రాజకీయాల్లో చురుగ్గా, నిర్విరామంగా పనిచేసే తీరిక మాత్రం లేదు అదే పెద్ద మైనస్సు. పార్టీ పెట్టినప్పటికీ దాన్ని ముందుకు నడిపే సీన్ ఆయనకు లేకుండా పోయింది. అందుకే ‘జనసేన’ పార్టీ ఇప్పటికీ ఏకసభ్య పార్టీగా కొనసాగుతోంది.

ఇదిలా వుంటే, ఆయన ఇప్పుడు మళ్ళీ జనాల ముందుకు వచ్చారు. రాజకీయ కామెంట్లు చేశారు. అది కూడా ప్రత్యక్షంగా కాదు.. ట్విట్టర్ మాధ్యమం ద్వారా. నేటి తరం నేతలు అందరూ దక్షిణాఫ్రియా జాతిపిత నెల్సన్ మండేలాని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన తన అమృత వాక్కులను ట్విట్టర్లో  పెట్టారు. పాపం పవన్ కళ్యాణ్ గారికి మన భారతీయ నాయకులెవరూ ఆదర్శంగా కనిపించలేదో ఏంటో. అయినా పవన్ కళ్యాణ్ లాంటి మహా మేధావులకు ఇండియాలో నాయకులెందుకు నచ్చుతారు... ఏ నెల్సన్ మండేలానో, ఏ చేగువేరానో అయితేనే బాగా నచ్చుతారు.. వారే ఆదర్శమంటారు.. అయితే రాజకీయంగా చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరికీ ఆదర్శంగా వుండరు. ఎందుకంటే ఇలాంటి గెస్ట్ ఆర్టిస్టును ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం  ఎవరికీ లేదు. రాజకీయంగా భారీ లక్ష్యాలు వున్నప్పుడు జనంలోకి వచ్చి పోరాటం చేయాలి. అంతేగానీ, ఆర్నెల్లకోసారి నిద్ర మేలుకుని ట్విట్టర్లో దర్శనమివ్వడం ఏమిటి? ఇలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడ్డం, రాజకీయ నాయకులు ఎవర్ని ఆదర్శంగా తీసుకోవాలో చెప్పడం మరీ ఎటకారంగా అనిపిస్తోంది.