ఈ బెదిరింపు సెక్షనేంటో!


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సెక్షన్ 8, సెక్షన్ 10 గురించి తీవ్రంగా డిస్కషన్ జరుగుతోంది. ఈ రెండు సెక్షన్లూ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నిప్పుల కుంపటిని మరింతగా రాజేస్తున్నాయి. ఈ రెండు సెక్షన్ల గొడవ ఇలా వుంటే, మరో సెక్షన్ కూడా ఇప్పుడు జనాన్ని అయోమయానికి గురి చేస్తోంది. జనం సంగతి అలా వుంచితే, సాక్షాత్తూ గవర్నర్ గారినే అయోమయానికి గురి చేస్తోంది. అందుకే ఆయన ఈ విషయంలో ఏం చేయాలి చెప్మా అని కేంద్రం తలుపు తట్టారు. ఇంతకీ ఆ సెక్షన్ ఏమిటంటే, ‘బెదిరింపు సెక్షన్’. ఈ సెక్షన్‌ని అమలు చేస్తోంది మరెవరో కాదు... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ బెదిరింపు ఏమిటనుకుంటున్నారు... తమకు వ్యతిరేకంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తాననే బెదిరింపు. ఈ మధ్యకాలంలో కేసీఆర్ ఈ బెదిరింపుతో అందర్నీ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

శుక్రవారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసిన గవర్నర్ నరసింహన్ ఇదే విషయాన్ని ఆయనతో చెప్పి ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదన్నట్టుగా మాట్లాడారన్న వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేస్తే తెలంగాణ అసెంబ్లీని రద్దుచేసి పారేస్తానని కేసీఆర్ బెదిరించారట. కేసీఆర్ గారికి ఇలా బెదిరించాలన్న ఐడియా ఎలా వస్తోందో ఏంటో. ఇలా బెదిరిస్తే పనులు అయిపోతాయని అనుకోవడం ఎంతవరకు న్యాయమో ఆయనే ఆలోచించుకోవాలి. గతంలో ఓసారి ఆయన ఈ బెదిరింపు సెక్షన్‌ అమలు చేసేసరికి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది దారిలోకి వచ్చినట్టున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థులందరూ గెలవకపోతే అసెంబ్లీనే రద్దు చేస్తానని కేసీఆర్ బెదిరించారు. ఆ బెదిరింపు కారణంగానే కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిక్కురుమనకుండా తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో తన బెదిరింపు సెక్షన్ వర్కవుట్ అయింది కాబట్టి ఇప్పుడు సెక్షన్ 8 విషయంలో కూడా అదే బెదిరింపు సెక్షన్ని అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టున్నారు.