తొలి విడత పంచాయతీ పోలింగ్ షురూ!
posted on Dec 11, 2025 6:16AM

తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం (డిసెంబర్ 11) ఉదయం షురూ అయ్యింది. తొలి విడతలో 3, 834 సర్పంచ్, 27 వేల 628 వార్డు సభ్యల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా పంచాయతీలలో విజయం సాధించిన వార్డు సభ్యులు ఉప సర్పంచ్ లను ఎన్నుకుంటారు.
వాస్తవానికి తొలి దశలో మొత్తం 4, 236 సర్పంచ్ పదవులకు ఎన్నిక జ రగాల్సి ఉండగా, ఐదు సర్పంచ్, 169 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. అలాగే 396 పంచాయతీలలో సర్పంచ్ లు, అలాగే 9633 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక పోతే.. ఒక పంచాయతీ సర్పంచ్, 10 వార్డు సభ్యుల ఎన్నికలపై కోర్టు స్టే ఉంది. దీంతో 3, 834 సర్పంచ్, 27 వేల 628 వార్డు సభ్యల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.