లాక్‌డౌన్ టైమ్‌లో పీఎంవోలో పార్టీలు.. పార్ల‌మెంట్‌లో క్షమాపణలు చెప్పిన ప్ర‌ధాని..

ఏడాది కింద‌టి విష‌యం. దేశ‌మంతా లాక్‌డౌన్‌. ప్ర‌జ‌ల‌పై క‌ఠిన ఆంక్ష‌లు అమ‌ల్లో ఉన్నాయి. ఎలాంటి పండుగ‌లూ, వేడుక‌లూ జ‌ర‌ప‌వ‌ద్ద‌ని ఆదేశాలు ఇచ్చారు. రూల్స్ బ్రేక్ చేస్తే.. జ‌రిమానాలు వేస్తామ‌నే హెచ్చ‌రికలు జారీ అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా ఇంత‌టి క‌ఠిన నిబంధ‌న‌లు విధించిన దేశ ప్ర‌ధాని కొలువుదీరి ఉన్న పీఎంవో ఆఫీసులోనే లాక్‌డౌన్ స‌మ‌యంలో గ్రాండ్ పార్టీలు జ‌రిగితే..? విందు, వినోదం.. ఆట‌, పాట‌ల‌తో ప్ర‌ధాని కార్యాల‌య సిబ్బంది సంబ‌రాలు చేసుకుంటే..? అంత‌కంటే దారునం ఇంకేమైనా ఉంటుందా? ఆంక్ష‌లు విధించిన పాల‌కుల స‌న్నిధిలోనే అధికారులు అలా పార్టీలు చేసుకోవ‌డం ఏమ‌న్నా సమంజ‌స‌మా? అందుకు దేశ ప్ర‌ధాని జాతికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. త‌ప్పు చేసిన అధికారుల‌పై వేటు వేశారు. ఈ విష‌యం బ్రిట‌న్‌లో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్‌.

కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం దేశమంతా నిషేధాజ్ఞలు అమలు చేసిన బ్రిటన్‌లో ప్రధాని కార్యాలయ సిబ్బందే వాటిని ఉల్లంఘించి విందులు, వినోదాలు జరుపుకున్నారు. లాక్‌డౌన్‌పై జోకులు వేసుకున్నారు. దేశ ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్న‌ సమయంలో వారు చేసిన నిర్వాకం ఏడాది తర్వాత తాజాగా వెలుగు చూసింది. ఆ వీడియో దృశ్యాలు లీకవడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పార్లమెంటులో దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. పీఎంవో లో జ‌రిగిన పార్టీపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. 2020 డిసెంబరు 18న ప్రధాని కార్యాలయ సిబ్బంది లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా విస్మరించి క్రిస్మస్‌ పార్టీ జరుపుకున్నారు. విందుతో పాటు ఆటలు, పాటలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. క‌ట్ చేస్తే.. నాలుగు రోజుల త‌ర్వాత ప్రధాని కార్యాలయ సిబ్బంది తాము చేసుకున్న పార్టీని గుర్తు చేసుకుని జోకులు వేసుకున్నారు. తెగ న‌వ్వుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు లీక్ కావ‌డంతో ఏడాది త‌ర్వాత విష‌యం వెలుగు చూసింది.

ప్రభుత్వ ప్రెస్‌ సెక్రెటరీ అలెగ్రా స్రాటన్‌ పరిహాసపు మాటలు వీడియోలో స్పష్టంగా రికార్డ‌య్యాయి. మరో అధికారి జ‌ర్న‌లిస్ట్‌లా యాక్ట్ చేస్తూ.. క్రిస్మస్‌ పార్టీ గురించి ప్రెస్ సెక్రెట‌రీని ప్రశ్నిస్తూ కామెడీ స్కిట్ చేసిన‌ట్టు ఆ వీడియోలో ఉంది. 

ఈ వ్యవహారంపై విపక్ష లేబర్‌ పార్టీ నేత స్టార్మర్‌.. ప్రధాని జాన్సన్‌ను నిలదీశారు. దీంతో పార్ల‌మెంట్‌లో బోరిస్‌ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత.. లీకైన వీడియోలో కనిపించిన ప్రెస్‌ సెక్రెటరీ అలెగ్రా స్రాటన్‌ తన పదవికి రాజీనామా చేశారు.