100 ఏళ్లనాటి పెంకుటిల్లుకు ఓటీఎస్.. జగనన్న సర్కారా మజాకా! 

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్ ) పైనే రచ్చ రచ్చ అవుతోంది. ఓటీఎస్ స్కీమ్ పై జనాలు భగ్గుమంటున్నా మొండిగా ముందుకు వెళుతోంది జగన్ సర్కార్. ఎవరికి బలవంతం లేదు.. స్వచ్ఛందమే అని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం జనాలను బెదిరిస్తూ అధికారులు వసూల్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి సీరియస్ గా ఆదేశాలు ఉండటం వల్లే తాము ఓటీఎస్ అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) కార్యక్రమంలో చిత్ర విచిత్రా లు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నిర్మించి న పెంకుటిల్లును సైతం అధికారులు ఓటీఎస్ లో చేర్చారు. ఇది పక్కా ఇల్లా.. పెంకుటిల్లా అని చూడకుండానే వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి  డబ్బులు చెల్లించాలని చెప్పారు. అంతేకాదు ఆ ఇంటి కొలతలు కూడా తీయడానికి సిద్ధమయ్యారు. సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ బుర్రే శ్రీధర్‌ వచ్చి ఇంటి కొలతలు తీయాలని చెప్పటంతో దంపతులు అవాక్కయ్యారు. ఆ ఇంటి పై ఎలాంటి రుణం పొందలేదని వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయమై హౌసింగ్‌ ఏఈ మల్లిఖార్జునరావును వివరణ కోరగా.. దీనిపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. 

కృష్ణాజిల్లా మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలో 96 ఏళ్ల క్రితం నిర్మించిన పెంకుటిల్లును లింగమనేని వెంకటసుబ్బమ్మ, రాజారావు వద్ద నుంచి 1981లో దండమూడి రాజగోపాలరావు-లక్ష్మి దంపతులు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అందులోనే నివసిస్తున్నారు. అయితే ఓటీఎస్ లో భాగంగా 1996-97లో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇండ్ల జాబితాలో రాజగోపాలరావు కు చెందిన పెంకుటిల్లు పేరును కూడా అధికారులు చేర్చారు. దీంతో స్థానిక వలంటీర్‌ తేజస్వి  వాళ్ల ఇంటికి వచ్చి ఓటీఎస్ జాబితాతో  పేరు ఉందని  చెప్పింది. ఇలాంటి ఘటనలు ప్రతి గ్రామంలో జరుగుతున్నాయని చెబుతున్నారు. ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించిన ఇండ్లకు ఓటీఎస్ పేరు చెప్పి డబుల్ కట్టాలని డిమాండ్ చేయడంపై జనాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.