ముగిసిన ఏపీ మంత్రి వర్గ సమావేశం..పలు కీలక నిర్ణయాలివే

 

పోలవరం -బసకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో  తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజకీయాల కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన అవసరం మంత్రులపై ఉందని చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. మొత్తం 42 అజెండా అంశాలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. అమరావతిలో మలివిడత భూసేకరణపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. తొలివిడత నిబంధనలే మలివిడతకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాలను ఇన్‌ఛార్జి మంత్రి నేతృత్వంలో జిల్లాస్థాయిలో నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.

రాజధానిలో మరో 44వేల ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్ర P4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అన్న క్యాంటీన్ ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్న క్యాంటీన్లు మానిటర్ చేయడానికి, ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకవడానికి ఒక కమిటీని వేయాలని సీఎం సూచించారు. టెన్నిస్ ప్లేయర్ సాకేత్‌కు గ్రూప్- 1 ఉద్యోగం ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్‌కు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేసే విధంగా చూడాలని సీఎంచంద్రబాబు తెలిపారు.

పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో కొన్ని పంటలకు డిమాండ్ లేకపోవడంతో మనం మార్కెట్‌లోనే ప్రవేశించి కొంటున్నామని స్పష్ట చేశారు. పొగాకుకు మార్కెట్‌లో ధర తక్కువగా ఉండటంతో రూ. 250 కోట్లు మనం మార్కెట్‌లో ప్రవేశించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో వాణిజ్య పంటలకు డిమాండ్ ఎక్కువ ఉన్న పంటలు వేసే విధంగా రైతులను మోటివేట్ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ రైతుల్లో అవగాహన తీసుకురావాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు