క‌రోనా రోగుల‌కు కాలం చెల్లిన మందులు.. వైద్యుల నిర్వాకం..

అస‌లే క‌రోనాకు స‌రైన మందంటూ లేదు. ఇప్ప‌టికే ఉన్న మందుల‌ను వాడుతూ.. ఎలాగోలా చికిత్స చేస్తున్నారు. అందుకే, ఒక‌ప్పుడు రెమ్‌డెసివిర్‌ను సంజీవ‌ని అనుకున్నారు. ఇప్పుడు ఆ మందుతో పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేదని ప‌క్క‌న‌పెట్టేశారు. ప్లాస్మా థెర‌పి సైతం అలానే సైడ్ అయిపోయింది. క‌రోనా సోకినాక‌.. ఏ రోగ ల‌క్ష‌ణం ఉంటే.. ఆ రోగానికి మందు వేస్తూ మేనేజ్ చేస్తున్నారు డాక్ట‌ర్లు. ఇమ్యూనిటీ పెంచేలా విట‌మిన్ టాబ్లెట్స్ ఇచ్చి నెట్టుకొస్తున్నారు. అలాంటిది.. ఆ ఇచ్చే మందు అయినా స‌రైన‌ది ఇవ్వాలిగా? ప‌నికొచ్చేది.. ఫ‌లితం ఇచ్చేది కావాలిగా?  కానీ, వైద్య ఆరోగ్య శాఖ నిర్వాకం అధ్వాహ్నంగా మారింది. కాల‌ప‌రిమితి ముగిసిన మందుల‌ను క‌రోనా బాధితుల‌కు ఇచ్చి వారికి కొత్త ప్ర‌మాదాన్ని కొనితెచ్చిపెడుతున్నారు. వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యం.. రోగుల‌కు ప్రాణసంక‌టంగా మారుతోంది. 

వరంగల్ రూరల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం, ఇల్లందలో జరిగింది ఆ దారుణం. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా బాధితులకు కాలపరిమితి ముగిసిన మందుల పంపిణీ చేయటం కలకలం సృష్టించింది. ఆ గ్రామంలో 50కి పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. స్థానిక ఆరోగ్య కేంద్రం ఎప్పుడూ బాధితుల‌తో కిక్కిరిసి ఉంటోంది. తాజాగా.. ఇల్లంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు.. కరోనా బాధితులకు కాలం చెల్లిన మందులు పంపిణీ చేయ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

తాజాగా, ఓ కరోనా బాధితురాలికి అవుట్ డేటెడ్ మెడిసిన్ ఇచ్చారు ఆరోగ్య కేంద్ర సిబ్బంది. ఏప్రిల్ నెల‌కే గ‌డువు ముగిసిన‌.. విటమిన్ సి, విట‌మిన్‌ డి టాబ్లెట్స్‌ను క‌రోనా బాధితురాలికి ఇవ్వ‌డం.. ఆమె కుటుంబ స‌భ్యులు.. ఆ మెడిసిన్‌ను ఫోటో తీసి.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం క‌ల‌క‌లంగా మారింది. 

కాలం తీరిన మెడిసిన్ ఇచ్చిన విష‌యం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చర్చనీయాంశమైంది. ఇప్పటికే రోగాలతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు భరోసా ఇవ్వాల్సిన ఆరోగ్య కార్యకర్తలు ఇలా కాలం చెల్లిన మందులు ఇచ్చి వారిని భయపెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల పని తీరు పై మెడికల్ ఆఫీసర్ కు పిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు గ్రామస్థులు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu