చినబాబు దూకుడు... సొంత టీమ్ తో యాక్టివ్ రోల్
posted on Oct 26, 2015 7:53PM

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా అపాయింటైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పార్టీలో మరింత యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు, మొన్నటివరకూ టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరించిన లోకేష్... ఇప్పుడు ప్రధాన కార్యదర్శి హోదాలో పూర్తిస్థాయిలో పార్టీపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా ఏపీ టీడీపీపై ఫోకస్ పెట్టిన చినబాబు సొంత టీమ్ ను తయారుచేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే కొందరు నేతలకు ఆయా జిల్లాల బాధ్యతలు అప్పగించారు లోకేష్. ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శులైన రెడ్డి సుబ్రమణ్యం, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వర్ల రామయ్య, జయనాగేశ్వర్ రెడ్డి వీరిలో ఉన్నారు.
తూర్పుగోదావరి జిల్లాకి చెందిన రెడ్డి సుబ్రమణ్యంకి శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించగా, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు అప్పగించారు, ఇక కృష్ణాజిల్లాకు చెందిన నేత వర్ల రామయ్యకు చిత్తూరు, కర్నూలు జిల్లాలు కేటాయించగా, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి కడప, అనంతపురం జిల్లాలు అప్పగించారు.
అయితే వీరంతా ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై నారా లోకేష్ కి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, వీళ్లిచ్చే నివేదికల ఆధారంగా చినబాబు రంగంలోకి దిగి పార్టీని మరింత పటిష్టంచేయనున్నారు.