నేను అలాగా అనలేదు: ఎర్రబెల్లి దయాకర్ రావు
posted on Oct 26, 2015 9:20AM
.jpg)
త్వరలో వరంగల్ లోక్ సభ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇటువంటి సమయంలో తెలంగాణా తెదేపాలో రేవంత్ రెడ్డి-ఎర్రబెల్లి దయాకర్ రావుల మధ్య విభేదాలు, పరస్పర విమర్శలు చేసుకొంటూ ఉండటం వలన పార్టీకి తీవ్రనష్టం జరుగవచ్చును. తెదేపా, బీజేపీలు కలిసి ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ తెదేపా తరపున రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉపఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్నారు. ఒకవేళ బీజేపీ అందుకు అంగీకరిస్తే తేదేపాకు అది చాలా మంచి అవకాశంగా భావించవచ్చును. కానీ ఈ ఎన్నికలలో పార్టీని విజయపధంలో నడిపించవలసిన ఇద్దరు ముఖ్య నేతలు-రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఈవిధంగా కలహించుకొంటుంటే, అది ప్రత్యర్ధ పార్టీలకు సానుకూల అవకాశంగా మారుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటప్పుడు తెదేపా అభ్యర్ధిని నిలబెట్టి ప్రత్యర్ధ పార్టీలకు చేజేతులా ఈ సువర్ణావకాశాన్ని జారవిడుచుకోవడం కంటే బీజేపీ అభ్యర్ధిని నిలబెట్టి అతనికి మద్దతు ఇస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎర్రబెల్లి దయాకరరావు తమ పార్టీ తరపున అభ్యర్ధిని నిలబెట్టాడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వర్గం ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. దానిని ఆయన తీవ్రంగా ఖండించారు. తను ఎన్.డి.ఏ. అభ్యర్ధిని నిలబెడతామని చెప్పాను తప్ప బీజేపీ అభ్యర్ధిని నిలబెడుతున్నట్లు చెప్పలేదని అన్నారు. ఈ ఉపఎన్నికలలో ఏ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టాలనే విషయంపై ఇంకా ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతుంటే తను బీజేపీ అభ్యర్ధిని నిలబెడుతున్నట్లు ఎందుకు ప్రకటిస్తానని ఆయన ప్రశ్నించారు. పార్టీలో కొందరు తనను దెబ్బతీయడానికే ఉద్దేశ్యపూర్వకంగా ఇటువంటి ప్రచారం చేతున్నారని ఆయన అన్నారు. ఏ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టినా వారికి కేంద్రంలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందని తాము ఎన్నికలలో ప్రచారం చేస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.