తాత్కాలిక ఖర్చుకు నో చెప్పిన చంద్రబాబు
posted on Oct 27, 2015 1:20PM

వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా అమరావతి శంకుస్థాపన వేడుకను ఎంతో అట్టహాసంగా అంగరంగవైభవంగా నిర్వహించిన చంద్రబాబునాయుడు... వేస్ట్ ఖర్చులకు మాత్రం తాను దూరమనే సంకేతాలు ఇచ్చారు, అమరావతిని ప్రపంచానికి పరిచయం చేయడానికే అంత పెద్దఎత్తున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించామని, పైగా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే విదేశాలను ఆకర్షించాలని, అందుకే అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబు జరపారని అంటున్నారు. అంతేకానీ అమరావతి పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదని, అయినా ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో... పెట్టిన పెట్టుబడి(ఖర్చు)కి ఎలా లాభాలు(పెట్టుబడులు) తీసుకురావాలో చంద్రబాబుకి తెలుసని టీడీపీ నేతలు అంటున్నారు.
స్టేట్ డెవలప్ మెంట్ పై చంద్రబాబుకి ఫుల్ క్లారిటీ ఉందని, ఆయన ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారని మంత్రులు కితాబిస్తున్నారు. అందుకే తాత్కాలిక అసెంబ్లీ పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేయడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారని గుర్తుచేస్తున్నారు. అసలే ఆర్ధిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోన్న ఆంధ్రప్రదేశ్ కి తాత్కాలికం పేరిట ఖర్చులు సరికాదని చంద్రబాబు భావించారని, అందుకే తుళ్లూరులో టెంపరరీ అసెంబ్లీ నిర్మాణానికి నో చెప్పారని అంటున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలను హైదరాబాద్ లోనే నిర్వహించాలని, లేదంటే మంగళగిరి సమీపంలోని హాయ్ లాండ్ ను వినియోగించుకోవాలని చంద్రబాబు తేల్చిచెప్పారు.
మరో మూడేళ్లలో సీడ్ కేపిటల్ నిర్మాణం పూర్తికానుండటం, అందులో అసెంబ్లీ భవనం కూడా ఉన్నందున తాత్కాలిక అసెంబ్లీకి వృథా ఖర్చు వద్దని స్పీకర్ కోడెలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు, పైగా ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిపైనా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్న నేపథ్యంలో తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం చేపడితే లేనిపోని తలనొప్పులు వస్తాయని స్పీకర్ కి సీఎం సర్దిచెప్పినట్లు తెలుస్తోంది.