ఆస్తులు కన్నా ఆదర్శాలే ముఖ్యమనుకున్న గొప్ప వ్యక్తి..... లాల్ బహాదూర్ శాస్త్రి వర్ధంతి..!

 

ఈ  రోజుల్లో  రాజకీయ నాయకులు అనగానే డబ్బు, హోదా, ఖరీదైన కార్లు  గుర్తొస్తాయి. ఎందుకంటే రాజకీయం అనగానే డబ్బు ఆర్జించే ఒక మార్గం అయిందిప్పటి కాలంలో. కానీ ఒక జాతీయ స్థాయి నాయకుడై  ఉండి, ఒక దేశ ప్రధానై  ఉండి కూడా  ఒక పాత కారుని ఈఎంఐ పద్ధతిలో  కొనుక్కున్నారొక మహనీయుడు.   వ్యక్తిగత ఆస్తి కూడబెట్టటం కంటే ప్రజా సేవనే ధ్యేయంగా పని చేశారాయన.  ఆయన ఎవరో కాదు..  జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో భారత ప్రజలను చైతన్యం చేసిన లాల్ బహదూర్ శాస్త్రి.  అందరూ ముద్దుగా శాస్త్రిజీ అని పిలుచుకునే లాల్ బహదూర్ శాస్త్రిగారు ఆస్తులకన్నా ఆదర్మాలే ముఖ్యమని నమ్మారు. అదే నేడు ఆయన్ను గొప్ప దేశ నాయకుడిగా నిలబెట్టింది. నిబద్దత, క్రమశిక్షణ, నిస్వార్థ గుణం,నమ్రత, విధేయత  కలిగిన పాతతరపు నాయకుల్లో ఈయన ఒకరు. మన దేశానికి రెండవ ప్రధానమంత్రిగా సేవలందించిన  లాల్ బహదూర్ శాస్త్రి వర్థంతి నేడు.. ఈ సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకంటే..


లాల్ బహాదూర్ శాస్త్రి 1904 అక్టోబర్2న మొగల్‌సరాయ్‌లో జన్మించారు. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. తండ్రి మరణానంతరం లాల్ బహాదూర్ శాస్త్రి  ఆయన చెల్లెల్లు వారి మామయ్య అయిన మున్షీ హజారీలాల్ ఇంట్లో పెరిగారు. 1928లో శాస్త్రి గారెకి  లలితా దేవితో వివాహం జరిగింది. ఆయనకి  నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుటుంబ సభ్యులు అంతా కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు.


స్వాతంత్రోద్యమంలో పాత్ర..

లాల్ బహాదూర్ శాస్త్రి హరిశ్చంద్ర హైస్కూల్‌లో ఉన్నప్పుడు దేశభక్తి, ప్రజాదరణ పొందిన ఉపాధ్యాయుడు నిష్కామేశ్వర్ ప్రసాద్ మిశ్రాగారి  ప్రేరణతో స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు.  మహాత్మా గాంధీ, పండిట్ మదన్ మోహన్ మాలవ్య నిర్వహించిన ఒక సమావేశానికి వెళ్ళిన శాస్త్రి  ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు బయటకు రావాలన్న  పిలుపు మేరకు, ఆ మరుసటి రోజే హరిశ్చంద్ర హైస్కూల్‌ను వదిలేశారు. వాలంటీరుగా చేరి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఆయన అనేక సార్లు జైలు శిక్షను అనుభవించారు. 1925లో కాశీ విద్యాపీఠం నుండి “శాస్త్రి” బిరుదుతో పాటూ తత్వశాస్త్రం, నైతిక శాస్త్రంలో పట్టా పొందారు. ఆయన లాలాలజపతిరాయ్ స్థాపించిన “లక్ సేవక్ మండల్”లో చేరి మహాత్మా గాంధీ నాయకత్వంలో ముజఫర్‌పూర్‌లో హరిజనుల కోసం పనిచేశారు. 1928లో మహాత్మా గాంధీ ఆదేశాల మేరకు భారత జాతీయ కాంగ్రెస్‌లో పూర్తి స్థాయి సభ్యుడిగా చేరారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు రెండు సంవత్సరాలపాటు జైలులో ఉన్నారు. 1940లో వ్యక్తిగత సత్యాగ్రహానికి మద్దతు తెలపడం వల్ల ఏడాది జైలులో గడిపారు. 1937, 1946లలో ఆయన యునైటెడ్ ప్రావిన్సెస్ శాసనసభకు ఎన్నికయ్యారు.

నిర్ణయాలు అద్బుతం..


భారత స్వతంత్రానంతరం శాస్త్రి ఉత్తరప్రదేశ్‌లో రవాణా, పోలీసుశాఖా మంత్రిగా సేవలందించారు. ఆయన రాజకీయ  పరంగా తీసుకున్న నిర్ణయాలు చాలా అద్బుతమైనవి. ఆయనే మొదటిసారి మహిళా కండక్టర్ల నియామకానికి మార్గం చూపించారు.  నిరసనల సమయంలో లాఠీలకు బదులుగా నీటి గొట్టాలను ఉపయోగించడానికి ఆదేశాలు జారీచేశారు. 1951లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, 1952లో రైల్వే, రవాణాశాఖ మంత్రిగా, 1961లో హోం మంత్రిగా పని చేశారు. నెహ్రూ మరణానంతరం 1964లో భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.


ప్రధానిగా..

1965భారత-పాక్ యుద్ధం సమయంలో ‘జై జవాన్ జై కిసాన్’ అనే  నినాదంతో జవాన్లను, రైతులను చైతన్య పరిచారు. పాల ఉత్పత్తిని పెంచడానికి అతి పెద్ద ఉద్యమానికి మద్దతుగా  అమూల్ సహకార సంఘానికి అండగా నిలిచారు. హిందీ భాషకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను శాంతి పూర్వకంగా పరిష్కరించారు. పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో కలిసి తాష్కెంట్ డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఆయన హయాంలో విధ్యా సంస్థలు, డ్యాములు, పోర్టులు ఎన్నో నిర్మితమయ్యాయి.   దేశ అభివృద్ధిలో ఆయన చేసిన  కృషి అమోఘం. ఆయన  ప్రధానమంత్రి హోదాలో  సోవియట్ యూనియన్, ఇంగ్లాండ్, కెనడా, నేపాల్, ఈజిప్ట్, బర్మా వంటి అనేక దేశాలను సందర్శించి విదేశాలతో మన దేశ సంబంధాలు మెరుగుగా ఉండేలా చేశారు.

మరణం..

శాస్త్రిగారు  1966వ సంవత్సరం,  జనవరి 11న తాష్కెంట్‌లో మరణించారు. 1965 ఇండో-పాక్ యుద్ధానికి శాంతి ఒప్పందంపై సంతకం చేసిన మరుసటి రోజే ఇలా జరిగింది. ఆయనను ఒక జాతీయ హీరోగా గుర్తించి, ఢిల్లీలో విజయ ఘాట్ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. లాల్ బహాదూర్ శాస్త్రి చాలా సాధారణ జీవితం గడిపారు. వ్యక్తిగత ఆస్తిని కూడబెట్టకుండా, ప్రజలకు సేవ చేయడంలో జీవితం గడపాలని ఉద్దేశించిన సేవక్ సొసైటీ సభ్యుడుగా ఉండేవారు.  శాస్త్రిగారి జీవితం నైతిక విలువలు, నమ్రత,  ప్రజా సేవకు ఆదర్శంగా నిలిచింది. తన జీవితాంతం ప్రజల కోసం పనిచేసి, దేశ అభివృద్ధికి విశేషమైన కృషి చేసి భారతదేశ చరిత్రలో మర్చిపోని నాయకుడిగా నిలిచారు.


                                           *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu