జీవితాన్ని నిలబెట్టే పురుషార్థాలు.. ఇందులో ఇంత అర్థముందని తెలుసా?
posted on Jan 21, 2026 3:45PM

భారతదేశం చాలా వైవిధ్యభరితమైనది. భారతీయ సంప్రదాయాలలో పురుషార్థాలు చాలా ప్రధానమైనవి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పురుషార్థాలు అని అంటారు. ఈ నాలుగింటిని అవలంభించడం వల్ల ప్రతి వ్యక్తి ఒత్తిడి నుండి విముక్తి అవుతాడని చెబుతారు. కానీ నేటి ఆధునిక కాలంలో వీటిని అటకెక్కించారు. ఈ నాలుగింటి గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఇవి వ్యక్తి జీవితంలో ఎంత ముఖ్యమైనవో తెలిసిపోతుంది. వీటి గురించి తెలుసుకుంటే..
ధర్మం..
జీవితంలో కొన్నిసార్లు మనం పారిపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఎందుకు అనే విషయం అర్థం కాదు. ధర్మం అంటే ప్రతి వ్యక్తి తన నిజమైన కర్తవ్యాన్ని అర్థం చేసుకోవడం. ప్రపంచానికి ఒక వ్యక్తి నుండి కావలసింది ఇదే.
ప్రతి వ్యక్తి తనలోకి తాను చూసుకోవాలి. అంటే.. ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఏది ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది? రోజువారీ చిన్న చిన్న పనులలో నిజాయితీని పాటించినప్పుడు లభించే సంతృప్తి చాలా గొప్పది. ఒక్కసారి దీన్ని అనుభవించినప్పుడు ఇక దాన్నుండి పక్కకు పోవాలన్నా పోలేరు.
అర్థం..
డబ్బు లేకుండా జీవితం కష్టమవుతుంది. అర్థ అంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, సమాజాన్ని ఆదుకునే శ్రేయస్సు. కానీ డబ్బును సంపాదించడమే అర్థం అనే విషయానికి నిజమైన వివరణ అనుకుంటారు చాలా మంది. ఈ కారణంగానే జీవితంలో డబ్బు కోసం చాలా పోరాటం చేస్తారు. దానిని ధర్మంతో సమతుల్యం చేసుకోవాలి.
ప్రతి వ్యక్తి తన అవసరాను గుర్తించాలి, తెలివిగా ప్లాన్ చేసుకోవాలి. కానీ అత్యాశతో ఉండకూడదు. ఉన్నదాంటో తృప్తి పడటం నేర్చుకోవాలి.
కామ..
కామ అంటే కోరికలు. ప్రేమ, ఇంద్రియ సుఖాలు. కోరికలను అణచివేయవద్దని, వాటిని సరైన మార్గంలో నెరవేర్చుకోవాలని అర్థం. కానీ ధర్మార్థాల విషయంలో రాజీ పడకూడదు. కామం అంటే కేవలం ఇంద్రియాల గురించే కాదు.. కామం అంటే కోరిక, పని.. ఇందులో చాలా ఉంటాయి. నేటి కాలంలో కామం అనగానే ఒక బూతు అనుకుంటారు. అది తప్పు.
ప్రతి రోజూ ఒక చిన్న ఆనందం అయినా ఉండేలా చూసుకోవాలి. ఎవరితోనైనా మాట్లాడాలి. ప్రకృతితో సమయం గడపాలి. కోరికలను బయటకు చెప్పడం కాదు.. బాలెన్సింగ్ గా ఉంచుకోవాలి.
మోక్షం..
మోక్షం అంటే విముక్తి. అన్ని ఒత్తిడి, భయం, బంధనాల నుండి విముక్తి. ఒక వ్యక్తి నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం. ధర్మం, అర్థ, కామాలు సమతుల్యంగా ఉన్నప్పుడు, మోక్షం సహజంగా వస్తుందని చెబుతారు.
మోక్షం వైపు అడుగులు వేయాలంటే ధ్యానం చేయాలి. యోగా చేయాలి, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవాలి. వర్తమానంలో జీవించాలి.
*రూపశ్రీ.