వైవాహిక బంధాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఎవరు బాధ్యత వహించాలి?
posted on Jan 20, 2026 1:55PM
.webp)
అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చడం, మూడు ముళ్లతో ఇద్దరు ఒక్కటవ్వడం.. ఇవన్నీ ఒక కొత్త జీవితానికి కేవలం మొదలు మాత్రమే. వివాహం తర్వాత భార్యాభర్తల బంధం క్రమంగా పలుచబడుతోందని, భార్యాభర్తలు పెళ్లైన కొత్తలో ఉన్నంత సంతోషంగా, ప్రేమగా ఉండలేకపోతున్నారని చాలా మంది అంటుంటారు. మూడు ముళ్లు పడినంత ఈజీగా వైవాహిక బంధం నిలబడదు. వైవాహిక బంధం నిలబడాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కృషి చేయాలి. చాలామంది పెళ్లైన తర్వాత వైవాహిక బంధం నిలబెట్టుకునే బాధ్యత అమ్మాయిలదే అంటుంటారు. అయితే దీని గురించి ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు రిలేషన్షిప్ నిపుణులు.. అవేంటో తెలుసుకుంటే..
బాధ్యత..
వైవావిక బంధం అనేది ఇద్దరు వ్యక్తుల వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఆ బంధాన్ని నిలబెట్టుకునే బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. చాలామంది కుటుంబాలలో పితృస్వామ్య వ్యవస్థ ఉంటుంది. దీని వల్ల మగవాడు తప్పు చేసినా సరే.. మహిళలే బాధ్యత వహించాలని, మగవారు తప్పుగా మాట్లాడినా మహిళలు సర్దుకుపోవాలని అంటుంటారు. మహిళలను చిన్నతనంగా చూడటం చేస్తుంటారు. ఇలాంటి కుటుంబాలలో మహిళలకు ప్రాధాన్యత ఏమీ ఉండదు.
కానీ ఒక వైవాహిక బంధం సంతోషంగా ఉండాలంటే ఆ బందానికి బార్యాభర్తలు ఇద్దరూ బాధ్యత వహించాలి. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఒకరి పట్ల మరొకరు బాధ్యతగా ఉంటారో.. అప్పుడు ఆ బందం కూడా బాగుంటుంది.
ఆనందం..
ఏ బంధంలో అయినా సంతోషం, ఆనందం ఉంటే ఆ బంధం ఎన్నేళ్లైనా బాగుంటుంది. మగవాళ్లు తమ వైవాహిక జీవితంలో కాకుండా బయటి నుండి సంతోషాన్ని వెతుక్కుంటే వారు ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేరు. తొందరగానే వారి జీవితంలో వెలితి కనిపిస్తుంది. ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండే వారితో వచ్చే ఆనందమే ఎక్కువ కాలం ఉంటుంది.
మహిళలు అయినా, పురుషులు అయినా తమ భాగస్వామిలో సంతోషాన్ని వెతుక్కునే వారు అయితే.. వారిద్దరి బంధం అన్యోన్యంగా ఉంటుంది. పురుషులు చాలా వరకు స్నేహితులతో, బయటి వ్యక్తులతో పార్టీలు, ఫంక్షన్లలో గడపడానికి ఇష్టపడుతుంటారు. కానీ భార్యతో, కుటుంబంతో గడిపినప్పుడు కలిగే ఆనందం.. ఆ కుటుంబాన్ని మరింత బలంగా మారుస్తుంది.
సంతృప్తి..
వివాహ బంధం సంతోషంగా ఉండాలంటే సంతృప్తి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉన్నదాంతో సంతృప్తి పొందేవారు, తమకు అలాంటి జీవితం ఇచ్చినందుకు దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండేవారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు.
ప్రతి ఒక్కరూ వైవాహిక ఆనందాన్ని బయట కాకుండా తమలోనే వెతకాలి. బయట వెతకడం వల్ల ఎప్పుడూ స్పష్టమైనది దొరకదు. అందుకే భాగస్వామికి సమయం ఇవ్వడం, వారితో గడపడం చేయాలి. ఇలా చేయడం వల్ల వారిలో ఉండే ఎన్నో విషయాలు వాటికవే అర్థమవుతాయి. వారి పట్ల ప్రేమ, గౌరవం మరింత బలపడతాయి.
*రూపశ్రీ.