దుఃఖాలు.. సమస్యలకు దూరంగా ఉండాలంటే ఇలా చేయండి..!

 


ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా గడపాలని కోరుకుంటాడు.  మానసిక సమస్యలకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు.  నేటి కాలంలో కొందరు  అనారోగ్యంతో బాధపడుతుంటే  మరికొందరు  కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతుంటారు. కొంతమంది ఉద్యోగం రాలేదని,   మరికొందరు తమకు జీతం తక్కువ అని, ఇంకొందరు జీతం సరిగా రావడం లేదని.. ఇలా  సగం ప్రపంచం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతోంది. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఎటువంటి ఆందోళన లేకుండా  సంతోషంగా ఉంటుంటారు. వాళ్లు అసలు అంత సంతోషంగా ఎలా ఉన్నారు? అనే విషయం కూడా కొందరికి అర్థమే కాదు.. అసలు  జీవితాన్ని సంతోషంగా,  ప్రశాంతంగా ఉంచగల మార్గాలు ఏమిటి? దుఃఖాలకు, సమస్యలకు దూరంగా ఉండటం ఎలా తెలుసుకుంటే..

తల్లిదండ్రుల సూచనలు..

 పిల్లలు తల్లిదండ్రుల  మాట విని సరైన మార్గాన్ని అనుసరిస్తే, అది తల్లిదండ్రులకు  చాలా సంతోషకరమైన విషయం. అలాంటి పిల్లలు కుటుంబానికి కీర్తిని తెస్తారు.  వారి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు. కాబట్టి జీవితంలో ఆనందం,  శాంతి కోరుకుంటే, ఎల్లప్పుడూ  తల్లిదండ్రుల సూచనలను పాటించాలి.  సరైన మార్గాన్ని అనుసరించాలి.  నేటి జెనరేషన్ అప్డేట్ అయి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రుల దగ్గర అనుభవం ఉంటుంది.  కాబట్టి వారి అనుభవ పూరిత సలహాలు ఎప్పుడూ నష్టం మాత్రం కలిగించవు.

 జీవిత భాగస్వామి మద్దతు..

జీవితంలో లైఫ్ పార్ట్నర్ చాలా ముఖ్యమైవారు.   జీవిత భాగస్వామి  సుఖదుఃఖాలన్నిటిలోనూ సపోర్ట్ ఇస్తూ అవగాహనతో మసలుకుంటే  జీవితం సులభంగా, సంతోషంగా మారుతుంది. జీవిత భాగస్వామి  అంటే పంచుకునేవారు. ఎలాంటి పరిస్థితిని అయినా అర్థవంతంగా చెప్పగలిగితే బాగస్వామి తప్పకుండా అర్థం చేసుకుంటారు.  ఎవరు అర్థం చేసుకోకపోయినా,  ఎవరు కష్టాలలో తోడు ఉండకపోయినా లైఫ్ పార్ట్నర్ తోడు ఉంటే బాధ, సమస్య ప్రభావం తెలియకుండా ఉంటుంది.

తృప్తి..

ఈ కాలంలో మనిషికి లోపించినది తృప్తి.   ఎక్కువ కోసం ఆరాటపడకపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా సంతోషంగా ఉంటాము. ముఖ్యంగా డబ్బు గురించి గొడవ చేసేవారు ఎప్పుడూ ఉన్నదాంతో  సంతృప్తి చెందరు. అందుకే మొదట డబ్బు దగ్గర ఉన్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకుంటే  అన్ని విషయాలలోనూ సంతృప్తిగా ఉండవచ్చు.

ఆశించడం..

 ఇతరుల సంపద,  ఆస్తి,  ఇతర వస్తువులు వంటివి కోరుకోవడం, తప్పని,  అది చాలా చీప్ మెంటాలిటీ అని  ఎప్పుడైతే తెలుసుకుంటారో.. అప్పుడు జీవితంలో దురాశను వదిలిపెడతారు. ఎవరినుండి అయినాఏదైనా ఆశించడం దురాశ చెందడమే. ఇట్లా దురాశను వదిలిన రోజు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.  ఎటువంటి కోరిక లేకుండా జీవితాన్ని గడుపుతాము.

భూత దయ..

నా వాళ్లు, మనవాళ్లు అని మాత్రమే కాదు.. అందరినీ, అన్ని జీవులను ప్రేమించాలి.అందరి పట్ల,  మూగ ప్రాణుల  పట్ల కూడా  దయ,  కరుణ కలిగి ఉంటే,   ప్రేమ,  శాంతిని నింపుకోగలుగుతారు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు,  మంచి ఆలోచనలు,  ఇతరులను ఇబ్బంది పెట్టని,  అన్ని జీవులను సమానంగా చూసే సమభావం అలవడుతుందో.. అప్పుడు మనిషి జీవితం ఎన్ని దుఃఖాలు, సమస్యలు వచ్చినా బాధకు లోనుకాకుండా ఉంటుంది.

                              *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu