కొత్త ఏడాదిలో అతిగొప్ప సంకల్పం.. మీరు బాగుండాలంటే ఇది చేయండి..!
posted on Jan 13, 2026 3:53PM
.webp)
ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు, తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఎవరికి వారు బాగుండాలంటే దానికి కావాల్సింది తమ చుట్టూ ఉన్న వ్యక్తులు మారడం లేదా వారు అర్థం చేసుకోవడం కాదు. ప్రతి వ్యక్తి తాము మారితేనే తమ జీవితం బాగుంటుందని అంటున్నారు లైప్ స్టైల్ నిపుణులు. కొత్త సంవత్సరంలో చాలామంది కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే దానికోసం మొదటగా ప్రతి ఒక్కరు తనకు తాను మారాలి అనే సంకల్పం చేసుకుంటే అదే గొప్ప మలుపు అవుతుంది. ఇది ఎందుకు మేలు చేస్తుంది? దీని కోసం ఏం చేయాలి? అనే విషయం తెలుసుకుంటే..
అహంకారం.. దూరం..
కుటుంబం అయినా, స్నేహం అయినా లేదా ఆఫీసు అయినా మనిషిలో ఉండే అహం సంబంధాలలో చీలికకు అతిపెద్ద కారణం అవుతుంది. చాలా సార్లు అవతలి వ్యక్తి సరైన విషయం చెబుతున్నా అది వినే వారి అహాన్ని దెబ్బతీస్తుంది. అందుకే అది నిజమైనా, అది మంచి విషయం అయినా దాన్ని అస్సలు అంగీకరించరు. ఈ చిన్న ఇగో కాస్తా క్రమంగా విభేదాలకు, దూరానికి కారణమవుతుంది. కొంతమంది ఎప్పుడూ తాము ఇతరులకన్నా గొప్పవారిగా భావిస్తారు. వారి మాటలే ఫైనల్ అంటుంటారు. అలాంటి మనస్తత్వం రిలేషన్స్ లో చేదు అనుభవాలను తెస్తుంది. బంధాలు కొనసాగాలి అంటే అహాన్ని పక్కన పెట్టడం, అవతలి వ్యక్తి స్థానాన్ని అర్థం చేసుకోవడం, చిన్న విషయాలను విస్మరించడం చాలా ముఖ్యం. ఈ చిన్న మార్పు పెద్ద వివాదాలను నిరోధించగలుగుతుంది.
ఇతరులను మార్చకండి..
రిలేషన్స్ లో అయినా ఇతర విషయాలలో అయినా చాలా మంది తమ సమయాన్ని, శక్తిని ఎదుటి వ్యక్తిని తమకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ గడుపుతారు. కానీ నిజం ఏమిటంటే ఇతరుల స్వభావాన్ని మార్చడం దాదాపు అసాధ్యం. మనం ఇతరులను మార్చడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తామో, అంతగా నిరాశ చెందుతాము. ప్రతి పరిస్థితిలోనూ ప్రశాంతంగా ఉండేవారు సమస్యలకు సులభంగా పరిష్కారాలను కనుగొంటారు. చాలా పాజిటివ్ గా, సంతోషంగా ఉన్న వ్యక్తులు ఒత్తిడి, నిరాశ, అధిక రక్తపోటు, ఆందోళన వంటి సమస్యలను రాకుండా చూసుకోగలుగుతారు. అందుకే ఇతరులను మార్చడం కంటే మనలో మార్పు కోసం కృషి చేయడం తెలివైన పని.
పాజిటివ్ గా ఉండాలి..
ఏ సంబంధం కూడా పూర్తిగా మన నియంత్రణలో ఉండదు. మనం ఇతరుల కోణం నుండి విషయాలను అర్థం చేసుకోకపోతే చాలా వరకు ప్రతికూల పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి. అంచనాలు ఉన్నప్పుడు ఇతరులలో తప్పులను వెతకుతుంటాము. ఇది అసంతృప్తికి గురిచేయడమే కాకుండా మన చుట్టూ ఉన్నవారిని కూడా ఇబ్బంది పెడుతుంది. పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం మంచిది. ఎప్పుడైతే మన ఆలోచన మారుతుందో.. అప్పుడు పరిస్థితులు కూడా పాజిటివ్ గా కనిపిస్తాయి. మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది. సానుకూల ఆలోచన ఉన్న వ్యక్తులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అనేక అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి.
ఆత్మ పరిశీలన..
ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు.. అలాగే ఎవరూ అన్ని విషయాలలో కరెక్ట్ గా ఉండరు. మన బలహీనతలు, తప్పులు, తెలియకుండానే ఇతరులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. అయితే అలాంటి వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. మొదట మనల్ని మనం నిజాయితీగా అర్థం చేసుకోవడం, మన లోపాలను అంగీకరించడం చాలా అవసరం. మన మనస్సును, తెలివితేటలు సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. మనం మన ఆలోచనలను సానుకూలంగా ఉంచుకుంటే మన తప్పులను అంగీకరించడం సులభం అవుతుంది. ఎవరికి వారు మారితే ఒత్తిడిని తగ్గిస్తుంది, ప్రతికూలతను దూరంగా ఉంచుతుంది. జీవితాన్ని మరింత సమతుల్యంగా చేస్తుంది. మంచి ఆరోగ్యం, సంతోషకరమైన మనస్సు, సంబంధాల మధ్య సామరస్యం, మనలో సానుకూల మార్పులు చేసుకోవడం.. ఇవన్నీ సంతోషకరమైన జీవితానికి మొదటి అడుగు అవుతాయి.
కాబట్టి జీవితం బాగుండాలంటే.. ఎవరి జీవితం వారికి బాగుండాలంటే పైన చెప్పుకున్న మార్పులు వచ్చే విధంగా కొత్త ఏడాదిలో ఒక లక్ష్యం పెట్టుకుని వాటికి అనుగుణంగా మారాలి. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు.
*రూపశ్రీ.