అమరావతికి కేంద్రం చట్టబద్దత!
posted on Jan 21, 2026 4:57PM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా వినతిపత్రం సమర్పించింది. 2024 జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో, ఏపీకి రాజధానిని తప్పక ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, రాజధానిగా అమరావతి ఎంపిక ప్రక్రియ, నిర్మాణ కార్యక్రమాలపై వివరాలను కూడా కేంద్రానికి నోట్ ద్వారా రాష్ట్ర ప్రభఉత్వం అందజేసింది.
ఈ విషయమై, కేంద్రం ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించడమే కాకుండా, నీతి ఆయోగ్ అభిప్రాయాన్ని కూడా కోరినట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యాక పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి అమరావతిని రాజధానిగా చట్టబద్ధంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం సూచించిన ప్రకారం.. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించేందుకు దాదాపు కేంద్రం నిర్ణయానికివచ్చేసినట్లు సమాచారం.