పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో అపచారం.. కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం
posted on Dec 31, 2025 10:02AM

సుప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఘోర అపచారం జరిగింది. సప్తగోదావరి తీరాన ఉత్తర గోపురం వద్ద ఉన్న కపాలేశ్వర స్వామి శివలింగాన్ని గుర్తుతెలియని దుండగులు సోమవారం (డిసెంబర్ 29 రాత్రి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మంగళవారం (డిసెంబర్ 30) ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తు న్నారు. శివలింగాన్ని సుత్తి వంటి ఆయుధంతో కొట్టి ధ్వసంం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే కోససీమ జిల్లా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడి ఆధారాలను సేకరించారు. ఆలయ ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో, చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఫుటేజీని పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశించారు. మంత్రి ఆనం స్పందిస్తూ.. ధ్వంసమైన చోట ఇప్పటికే వేద పండితుల సమక్షంలో కొత్త శివలింగాన్ని పునఃప్రతిష్ఠించామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.
మరోవైపు, ఈ ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఖండించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, హిందూ ధర్మంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.