జనవరి 2 నుంచి పట్టాదారు పుస్తకాల పంపిణీ
posted on Dec 31, 2025 9:52AM

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 2 నుంచి 9 వ తేదీ వరకూ దాదాపు 21.80 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రించిన ఈ పాసుపుస్తకాలను రైతులకు అంద జేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఒక వేళ ఆ పాసుపుస్తకాలలో ఏవైనా పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునే అవకాశం కూడా అధికారులు కల్పిస్తున్నారు. ఈ పాసుపుస్తకాల పంపిణీ కోసం ఊరూరా గ్రామ సభలు నిర్వహించనున్నారు.
వైసీపీ హయాంలో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫొటోను ముద్రించిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మా పాసుపుస్తకాలపై జగన్ ఫొటో ఏమిటంటూ రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ప జగన్ బొమ్మను తొలగించి రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలను ముద్రించి రైతులకు పంపిణీ చేస్తోంది.