కమల్ హాసన్ కార్యాలయానికి వారం రోజులు స్పెషల్ పవర్ కట్!
posted on Dec 11, 2015 8:22AM
.jpg)
చెన్నైలో ఇటీవల కురిసిన బారీ వర్షాల కారణంగా నగరం అస్తవ్యస్తం అవడంతో ‘తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని’ కోలీవుడ్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ విమర్శించారు. ‘తనవంటి ప్రముఖులు విరాళాలు ఈయవలసి వస్తోందంటే ప్రజలు కట్టిన పన్నులన్నీ ఏమయిపోతున్నాయో?’ అని ప్రశ్నించారు.
ఆయన చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు ఆర్ధికమంత్రి పనీర్ సెల్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమల్ హాసన్ కి ఆరు పేజీల బహిరంగ లేఖ వ్రాశారు. అది చూసి కంగారుపడిన కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చుకొని క్షమాపణలు కూడా చెప్పారు. కానీ తమిళనాడులో అమ్మ (జయలలిత) ప్రభుత్వంపై ఎవరయినా విమర్శలు చేస్తే అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. కమల్ హాసన్ కూడా మూల్యం చెల్లించక తప్పలేదు. ఆల్వార్ పేటలోని ఎల్డం రోడ్డులో ఉన్న ఆయన కార్యాలయానికి వారం రోజుల పాటు పవర్ కట్ చేయబడింది. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్దరించినప్పటికీ ఎల్డం రోడ్డు కాలనీలో మాత్రం అందుకే పునరుద్దరించలేదని అందరూ భావించారు. కమల్ హాసన్ కార్యాలయానికి మాత్రమే పవర్ కట్ చేస్తే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది కనుక ఎల్డం రోడ్డు కాలనీలో ఉన్న అన్ని ఇళ్ళకి గత వారం రోజులుగా పవర్ కట్ చేసారని మీడియాలో వార్తలు వచ్చేయి.
దానిపై రాష్ట్ర విద్యుత్ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ అవన్నీ అర్ధరహితమయిన ఆరోపణలని కొట్టిపడేశారు. “ఆ ప్రాంతంలో ఒక అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబిల్ పాడయిపోయింది. కానీ అక్కడ నీళ్ళు నిలిచిపోవడంతో ఇన్నాళ్ళు రిపేర్ చేయడం సాధ్యం కాలేదు. అందుకే ఎల్డం రోడ్డు ప్రాంతంలో విద్యుత్ సరఫరా పునరుద్దరించడానికి ఆలశ్యం జరిగింది,” అని వివరణ ఇచ్చేరు. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పినపటికీ బహుశః మున్ముందు ఇటువంటి సమస్యలు ఇంకా ఎదుర్కోకాక తప్పదేమో?