ముఖ్యమంత్రిని చంపుతానని ఎమ్మెల్యే హెచ్చరిస్తుంటే జగన్ ముసిముసి నవ్వులా?

 

వైకాపా సంస్క్రతి ఎంత గొప్పదో నిన్న చింతపల్లిలో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభలో మరొకమారు బయటపడింది. విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జగన్ ఆ సభను నిర్వహించారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై షరా మామూలుగా తీవ్ర స్వరంతో విమర్శలు గుప్పించారు.

 

ఇటువంటివన్నీ ప్రస్తుత రాజకీయాలలో మామూలు విషయాలే అని సరిపెట్టుకోవచ్చును. కానీ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తను ఒక ప్రజా ప్రతినిధిననే విషయం కూడా మరిచిపోయినట్లు “ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో అడుగుపెట్టినట్లయితే ఆయన తల నరుకుతాను...బాణాలతో చంపుతాము” అని తప్పుగా మాట్లాడారు. ఆమె అలాగ మాట్లాడుతుంటే పక్కనే నిలబడిన జగన్మోహన్ రెడ్డి చిర్నవ్వులు చిందించారు తప్ప ఆమెను వారించే ప్రయత్నం చేయలేదు. అది చూసి ఆమె మరింత రెచ్చిపోతూ ముఖ్యమంత్రిని ‘వాడు...వీడు..’ అంటూ సంభోదిస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే జగన్ ఆమె మాటలు విని ముసిముసి నవ్వులు నవ్వారు.

 

ఆమె వెనుకబడిన ప్రాంతానికి చెందిన ఒక గిరిజన మహిళ కనుక ఆమెకు తన పరిధిని అతిక్రమించకూడదనే విషయం తెలిసిఉండకపోవచ్చునని సరిపెట్టుకోవచ్చును. కానీ పక్కనే నిలబడి ఉన్న జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలు తెలుసు. కానీ ఆయన తన పార్టీ ఎమ్మెల్యే ఆవిధంగా ముఖ్యమంత్రిపట్ల అభ్యంతరకరంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని హత్య చేయడానికి కూడా వెనుకాడనని హెచ్చరిస్తుంటే ఆయన వెంటనే ఆమెను వారించకపోగా ముసిముసి నవ్వులు నవ్వడాన్ని ఏమనుకోవాలి?

 

ఎమ్మెల్యేగా ఎన్నికయిన తరువాత ప్రజాప్రతినిధులు అందరూ తాము రాజ్యాంగానికి లోబడి నడుచుకొంటామని ప్రమాణం చేస్తారు. కానీ వైకాపా ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని చంపుతానని బహిరంగంగా హెచ్చరిస్తుంటే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆమె మాటలను సీరియస్ గా తీసుకొన్నట్లయితే అమవుతుందో ఆమెకి తెలియక పోవచ్చును కానీ జగన్మోహన్ రెడ్డి తప్పకుండా తెలిసే ఉంటుంది. అయినా ఆమెను వారించకపోవడం చూస్తుంటే ఆమెను ఆవిధంగా మాట్లాడటాన్ని ఆయనే ప్రోత్సహించినట్లు భావించవలసి ఉంటుంది. లేదా తన మనసులో చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న ద్వేషం, ఆగ్రహం ఆమె మాటలలో వ్యక్తం అవుతుంటే అందుకు ఆయన చాలా సంతోషించినట్లు భావించవలసి ఉంటుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu