తెలంగాణ రైలు ఏపీకి..

హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే డబుల్ డెక్కర్ రైలు స్టేట్ మారింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణించే ఈ రైలును ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. వేరే రాష్ట్రాల లాబీయింగ్‌ను అధిగమించి మరి సాధించుకున్న ఈ డబుల్ డెక్కర్ రైలుకు రైల్వే యంత్రాంగం ప్రణాళికాలోపం కారణంగా ఆదరణ కరువైంది. హైదరాబాద్ నుంచి వారంలో రెండు రోజులు తిరుపతి, మరో రెండు రోజులు గుంటూరుకు తిరుగుతున్న ఈ రైలు ఆక్యుపెన్సీ రేషియా అతి తక్కువగా చూపెడుతోంది. అధికారులు ముందస్తు సర్వే లేకుండా రద్దీ లేని కాచిగూడ-గుంటూరు మార్గంలో దీనిని నడిపారు.

 

అలా కాకుండా ప్రయాణికుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగా ఉండే హైదరాబాద్-విజయవాడ వయా వరంగల్ మార్గంలో దీనిని నడిపి ఉంటే ప్రజల ఆదరణ దక్కేది, రైల్వేకి కూడా ఆదాయం పెరిగేది. పైగా తిరుపతి వంటి దూరప్రాంతానికి రాత్రిపూట కూర్చోని ప్రయాణించలేరు. ఇన్ని ప్రతికూలతల మధ్య డబుల్ డెక్కర్‌ను ఏపీకి షిఫ్ట్ చేయాలని రైల్వే వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. హైదరాబాద్-విజయవాడ, విశాఖపట్నం-హైదరాబాద్, విశాఖపట్నం-తిరుపతి మధ్య నిత్యం విపరీతమైన రద్దీ ఉంటోంది. రోజువారి రైళ్లకు తోడు అదనంగా రైళ్లను ఏర్పాటు చేసినా జనానికి ఏమాత్రం చాలడం లేదు. బుకింగ్ ఓపెన్ చేస్తే చాలు నెల రోజుల ముందే వెయిటింగ్ జాబితా చాంతాడంత చూపెడుతోంది. దీంతో ఈ మార్గంలో అదనంగా రైళ్లను నడపాలని ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.

 

అటు విశాఖ- విజయవాడ మార్గంలో డబుల్ డెక్కర్ నడపాలని ఆ ప్రాంత వాసులు రైల్వే శాఖకు వినతిపత్రాలు సమర్పించారు. విశాఖ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల లోపు జన్మభూమి, సింహాద్రి, మాత్రమే ఉన్నాయి. తిరిగి మధ్యాహ్నాం వరకు ఎలాంటి రైళ్లు అందుబాటులో లేవు. తిరిగి మూడు గంటలు దాటిన తర్వాత అదే పరిస్థితి.. దీంతో ఈ మధ్య సమయాల్లో విశాఖ, గోదావరి, లింక్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే సూపర్‌స్టార్‌ ఎక్స్‌ప్రెస్‌లపై ప్రయాణికులు ఆధారపడుతున్నారు. ఈ రైళ్లలో ఉన్న జనరల్ కోచ్‌లు అక్కడి నుంచే కిక్కిరిసివస్తుండటంతో ఉభయగోదావరి, విశాఖ జిల్లా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

 

ఇప్పుడు ఈ డబుల్ డెక్కర్‌ను విశాఖ నుంచి నడిపించడం ద్వారా ప్రజల కోరికను తీర్చినట్లే కాకుండా ఆక్యుపెన్సీని పెంచుకోవచ్చని సౌత్ సెంట్రల్ రైల్వే యోచిస్తోంది. ప్రస్తుతానికి ఈ రైలును ఈ నెల 12 నుంచి 30 వరకు తాత్కాలికంగా నిలుపుదల చేయనున్నారు. తొలుత విశాఖ, దువ్వాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట మీదుగా తిరుపతి వరకు డబుల్ డెక్కర్‌ను నడపనున్నారు. రూట్ సర్వే నిర్వహించిన తర్వాత రైలును ప్రతిరోజూ నడపాలా..లేదా వారంలో రెండు పర్యాయాలు నడిపాలా అనే దానిని నిర్ణయిస్తారు. ఇదంతా తర్వాత గాని ఈ డబుల్ డెక్కర్‌ను ఏపీకి తరలిస్తే తెలంగాణ ప్రజల నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంది. రైల్వేశాఖ ఈ విషయంపై కూడా దృష్టి పెడితే మంచిది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu