వైసీపీ నుంచి పోయిన వాళ్లు పోగా.. ఉన్నవాళ్లని జగన్ తరిమేస్తున్నారా?
posted on Feb 12, 2025 11:48AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఆ పార్టీలోని సీనియర్లను తీవ్ర అయోమయానికి గురి చేస్తున్నాయి. అసలే గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు. దీంతో వైసీపీ నేతలు, క్యాడర్ లో నైతిక స్థైర్యం బాగా దెబ్బతింది. అధికారంలో ఉన్నంత కాలం నోటికొచ్చిన బూతులతో ప్రత్యర్థులపై రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు నోరు తెరవాలంటేనే భయపడుతున్న పరిస్థితి. వైసీపీ కోలుకుని రాజకీయంగా చురుకుగా మారడం కష్టమని భావించిన ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే తమ దారి తాము చూసుకున్నారు. కూటమి పార్టీలలో సర్దుకున్నారు. మరి కొందరు రాజకీయాలకు దూరంగా ఉంటామంటూ ప్రకటనలు చేసి పార్టీకి రాజీనామా చేశారు.
ఇక మిగిలిన వారిని జగన్ స్వయంగా పార్టీ నుంచి తరిమేసే కార్యక్రమం ఏదైనా పెట్టుకున్నారా? అంటూ అనుమానాలు పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతున్నాయి.
సాధారణంగా ఏ పార్టీ అయినా ఎన్నికలలో అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్న తరువాత.. పొరపాటు ఎక్కడ జరిగింది, ప్రజా విశ్వాసాన్ని ఎందుకు కోల్పోయాం. తిరిగి ప్రజల నమ్మకాన్ని పొందడం ఎలా అని ఆలోచిస్తుంది. ఘోర ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకుంటుంది. పార్టీని మళ్లీ గాడి లోకి పెట్టడానికి ఏం చేయాలన్నదానిపై సమాలోచనలు చేస్తుంది. కానీ వైసీపీలో ఈ ఎనిమిది నెలల కాలంలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ కొన్ని రోజులు, తెలుగుదేశం అధినేత ఆచరణ సాధ్యం కాని హామీల కారణంగానే ఓటమి పాలయ్యామంటూ కొన్ని రోజులు గడిపేసింది.
ఎంత సేపూ తాము బ్రహ్మాండమైన పాలన అందించాం. సంక్షేమాన్ని దండిగా ఇచ్చాం.. అని చెప్పుకోవడమే కాకుండా క్రమం తప్పకుండా బటన్ నొక్కి సొమ్ము పందేరం చేసినా దానిని తీసుకుని కూడా జనం తమకు ఓట్లేయలేదని నెపాన్ని ప్రజల మీదకు నెట్టేయడంతోనే వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ నేతలూ ఈ ఎనిమిది నెలలూ గడిపేశారు. దీంతో పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని పలువురు నేతలు జగన్ కు బైబై చెప్పేశారు. అలా వెళ్లిపోవడం అన్నది పార్టీలో అత్యంత కీలక నేత, జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడు అయిన విజయసాయి వరకూ సాగింది. దీంతో ఇక పార్టీలో మిగిలిన వారిని కాపాడుకోవడానికి జగన్ ప్రయత్నాలు ప్రారంభిస్తారని అంతా భావించారు. అంటే పార్టీ పదవులలో మిగిలి ఉన్న సీనియర్లను నియమించి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేలా కార్యక్రమాలను రూపొందిస్తారని అంతా భావించారు. అయితే జగన్ తీరు మాత్రం పార్టీలో ఇంకా మిగిలి ఉన్న సీనియర్లను తరిమేసేలా ఉందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి, రెండు సార్లు ఎమ్మెల్యే అయిన రోజాను పార్టీ నుంచి తరిమేయడానికి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. గతంలో మాజీ మంత్రి బాలినేని విషయంలో కూడా ఇలాగే వ్యవహరించి చివరకు ఆయనంతట ఆయనే పార్టీ వదిలి వెళ్లిపోయేలా చేసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సరే విషయానికి వస్తే.. నగరి నియోజకవర్గ ఇన్ చార్జిగా రోజాను కాకుండా.. ఇప్పుడు కొత్తగా వైసీపీలో చేరడానికి సిద్ధమైన నాయకుడిని నియమించాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలలోనే గట్టిగా చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడి పెద్ద కుమారుడు గాలి భాను ప్రకాష్ నగరి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన రోజాపై భారీ మెజారిటీతో గెలుపోందారు. ఇప్పుడు గాలి ముద్దుకృష్ణమ రెండవ కుమారుడు గాలి జగదీశ్ వైసీపీ గూటికి చేరనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆయన బుధవారం వైసీపీ కండువా కప్పుకుంటారు. ఆయననను పార్టీలో చేర్చుకుని నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే రోజాకు పార్టీ నుంచి బయటకు వెళ్లమని మర్యాదగా చెప్పినట్లేనని అంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో గాలి జగదీశ్ ను వైసీపీలో చేర్చుకోవడంపై రోజా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అబ్యంతరాన్ని ఆమె నేరుగా జగన్ కే తెలియజేశారని అంటున్నారు. దీంతో గాలి జగదీశ్ వైసీపీ చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద జగన్ వ్యవహార శైలి పార్టీలోని సీనియర్లకు కాళ్ల కింద కుంపటి పెడుతున్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.