రాజకీయాలకు చిరంజీవి మాత్రమే దూరం.. ఆయనకు రాజకీయాలు కాదు!
posted on Feb 12, 2025 10:56AM

చిరంజీవి ఇటీవలి కాలంలో ఏం మాట్లాడినా అది రాజకీయ చర్చకు దారి తీస్తున్నది. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. కానీ రాజకీయాలు మాత్రం ఆయనకు దూరం కాలేదు. ఆయన ఏం మాట్లాడినా, ఎవరిని కలిసినా అది రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇటీవల లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ప్రజారాజ్యమే ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందిందని చిరంజీవి అన్న మాటలు, జై జనసేన అంటూ చేసిన నినాదం రాజకీయ చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాను జనసేనకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చిరంజీవి విస్పష్టంగా చెప్పేశారని పరిశీలకులు విశ్లేషించారు. ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి చేరువ అవుతున్నారనీ, ఆయన బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరిగింది.
అది కొంచం సద్దుమణిగే సరికి లైలా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన జనసేనకు అనుకూలంగా మాట్లాడిన మాటలు మరోసారి చిరంజీవి రాజకీయాలలో యాక్టివ్ కానున్నారన్న సంకేతాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి తన రాజకీయాలపై మనసులో మాట చెప్పారు. బ్రహ్మానందం నటించిన బ్రహ్మా ఆనందం సినిమా ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు పూర్తిగా దూరం అని కుండబద్దలు కొట్టడమే కాకుండా, రాజకీయంగా తాను సాధించాలనుకున్నవన్నీ తన తమ్ముడు, జనసేన అధినేత పవర్ కల్యాణ్ సాధిస్తారని చెప్పారు. తాను పూర్తిగా సినిమాలకు పరిమితం అని చెప్పేశారు. అలా చెబుతూనే తాన ఆకాంక్షలు, ఆశయాలు పవన్ కల్యాణ్ నెరవేరుస్తారనడం ద్వారా తన అభిమానులకు మాససికంగా తాను జనసేనవైపు ఉన్నానన్న సంకేతాలు ఇచ్చారు. ఇక రాజకీయంగా తాను సాధించాలనుకున్నవన్నీ పవన్ సాధిస్తారు అనడం వెనుక ఉద్దేశమేమిటన్న చర్చ మొదలైంది.
దీంతో చిరంజీవి స్వయంగా తాను రాజకీయాలకు దూరం అని ప్రకటించినా, రాజకీయం మాత్రం ఆయన చుట్టూనే తిరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో చిరంజీవి గతంలో నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రమేషన్లలో భాగంగా చెప్పిన ఓ డైలాగ్ ‘నేను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీతో సంబంధం లేకుండా ఆయన చుట్టూ రాజకీయాలు ప్రదక్షణం చుస్తున్నాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.