గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం బాధాకరం.. వరుస అగ్ని ప్రమాదాలపై చర్యలు లేవి? : కేటీఆర్
posted on May 18, 2025 1:32PM
.webp)
హైదరాబాద్ గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రమాద వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యానని ఆయన తెలిపారు. ఈ ఘటన చాలా హృదయవిదారకం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. మంటలు త్వరగా అదుపులోకి రావాలి. ఘటనను ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన ఉచిత చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఈ సంక్షోభ సమయంలో అవసరమైన ఏ సహాయానికైనా అందుబాటులో ఉంటారు.
ఈ ఘటనలో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు అధికారులతో కలిసి పనిచేస్తారు. స్థానిక బిఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రమాద స్థలం వద్ద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అని కేటీఆర్ సూచించారు. అలాగే ప్రభుత్వం ఈ అగ్నిప్రమాదానికి కారణాలను లోతుగా విచారించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం ప్రకటించాలి. పాతబస్తీతో పాటు హైదరాబాద్ నగరంలో అగ్ని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలి. అగ్నిమాపక శాఖ సామర్థ్యాన్ని పెంచాలి. ఈ విషాద సమయంలో హైదరాబాద్ ప్రజలందరూ ఐక్యంగా నిలిచి, బాధితులకు అండగా ఉండాలి. ’’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందటం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నదని విమర్శించారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం అనుసరించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు సమిధలవుతున్నారని చెప్పారు. ఎంతో మంది క్షతగాత్రులు అవుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.